జాతి వివక్ష: మరో ఇంగ్లండ్‌ క్రికెటర్‌పై వేటు పడనుందా! 

8 Jun, 2021 10:06 IST|Sakshi

లండన్‌: జాతి వివక్ష, విద్వేష, లైంగిక వ్యాఖ్యలకు సంబంధించి  ట్వీట్లు చేశాడన్న కారణంతో క్రికెటర్‌ ఓలీ రాబిన్సన్‌ను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) సోమవారం అంతర్జాతీ క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల క్రితం​ తెలియక చేసిన పని రాబిన్‌సన్‌ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన ఈసీబీ మరో ఇంగ్లండ్‌ ఆటగాడిని విచారించినట్లు సమాచారం.

అయితే ఆ ఆటగాడు ఎవరనేది మాత్రం ఈసీబీ వెల్లడించలేదని ప్రముఖ స్పోర్ట్స్‌ పత్రిక విజ్డెన్‌ తెలిపింది. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఆ క్రికెటర్‌ అండర్‌ 16 కేటగిరిలో ఉన్నాడని విజ్డెన్‌ పేర్కొంది. ఇదే అంశంపై ఈసీబీ అధికార ప్రతినిధి స్పందిస్తూ..'' ఓలి రాబిన్సన్‌పై చర్య అనంతరం జాతి వివక్ష, లైంగిక పరమైన ట్వీట్స్‌ చేసిన మరో ఆటగాడికి సంబంధించి మాకు సమాచారం అందింది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టి సదరు ఆటగాడిని విచారిస్తున్నాం. నిజానిజాలు తెలియనందున ఇప్పుడే ఏం చెప్పలేం. త్వరలోనే అన్ని విషయాలు వివరిస్తాం '' అని తెలిపారు.

ఇక రాబిన్సన్‌ 2012-13లో 19 ఏళ్ల వయసులో జాతి వివక్ష, లైంగిక పరమైన ట్వీట్స్‌ చేసినట్లు తేలడంతో ఈసీబీ అతన్ని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేసింది. కాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తన మొదటి టెస్టులోనే రాబిన్సన్‌ ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీయడంతో పాటు.. బ్యాటింగ్‌లో 42 పరుగులు చేశాడు. 

ఇక న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ డ్రాతో గట్టెక్కింది. కివీస్‌ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ డామినిక్‌ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్‌ జో రూట్‌ (40) పర్వాలేదనిపించాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో అదరగొట్టిన కివీస్‌ ఆటగాడు డెవాన్‌ కాన్వేను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది.
చదవండి: తొమ్మిదేళ్ల కిందట ట్వీట్లు.. ఇప్పుడు శిక్ష!

మరిన్ని వార్తలు