IND Vs PAK: ఈసీబీ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన బీసీసీఐ!

28 Sep, 2022 22:05 IST|Sakshi

క్రికెట్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌లకు ఎనలేని క్రేజ్‌ ఉంటుదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఐసీసీ, ఆసియా కప్‌ లాంటి మేజర్‌ టోర్నీల్లో తప్ప పెద్దగా మ్యాచ్‌లు ఆడలేదు. అందుకే భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు అంత క్రేజ్‌ ఉంటుంది. ఇక అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌లో ఈ చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌ కోసం ఇరుదేశాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

తాజాగా టీమిండియా, పాకిస్తాన్‌లు ఒప్పుకుంటే మా దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహించేందుకు సిద్ధమని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే ఈసీబీ ప్రతిపాధించింది వన్డేలు, టీ20లు కాదు. ఐదు రోజుల పాటు జరిగే టెస్టు సిరీస్ కోసం. బీసీసీఐ, పీసీబీ ఒప్పుకుంటే తమ దేశంలో ఇండియా-పాక్ లతో మూడు టెస్టులు ఆడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీబీ  ప్రతిపాదించింది. కానీ ఈసీబీ ప్రతిపాదనను ఇరు దేశాల బోర్డులు తిరస్కరించినట్టు సమాచారం. తటస్థ వేదికపై  ఇండియా-పాక్ టెస్టు మ్యాచ్ లు జరిపించాలన్న ఆలోచన తమకు లేదని.. ఆడితే ఇండియాలో అయినా లేదంటే పాకిస్తాన్ లో ఓకే గానీ టెస్టులను కూడా ఇతర దేశాలలో తాము ఆడబోమని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తున్నది. 

ఇక సుమారు 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్‌ జట్టు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్లపై  ఉగ్రవాదుల దాడి తర్వాత సుమారు పదేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు లేక అల్లాడిన పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే విదేశీ జట్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా రాగా ఇప్పుడు ఇంగ్లండ్ పాక్ పర్యటనకు వచ్చింది. టి20 సిరీస్ ముగిశాక డిసెంబర్‌లో ఇంగ్లండ్‌ టెస్టులు ఆడేందుకు మరోసారి పాక్‌కు రానుంది. ఈ సిరీస్ చర్చ సందర్బంగానే ఈసీబీ పీసీబీ ఎదుట ప్రతిపాదనను తెచ్చినట్టు సమాచారం. ఇంగ్లండ్‌లో దక్షిణాసియా వాసులు అధికంగా ఉన్నారని.. తద్వారా అక్కడ ఇండియా-పాకిస్తాన్ టెస్టు సిరీస్ సూపర్ హిట్ అవుతుందని ఈసీబీ భావిస్తున్నది. మరోవైపు బీసీసీఐ కూడా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది.

 ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ''ఇండియా-పాక్ సిరీస్ గురించి ఈసీబీ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు అంటే అది బీసీసీఐ పరిధిలో లేదు.  అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇప్పటివరకైతే  ఇండో-పాక్ ద్వైపాక్షిక సిరీస్ గురించి మా వైఖరిలో మార్పు లేదు. పాకిస్తాన్‌తో ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే ఆడతాం'' అని కుండబద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ లు చివరిసారిగా 2007లో టెస్టు సిరీస్ ఆడాయి.  ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ రెండు దేశాల మధ్య దూరం నానాటికీ పెరుగుతున్నది.

మరిన్ని వార్తలు