మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో జమైకా క్లీన్‌స్వీప్‌

1 Aug, 2021 06:23 IST|Sakshi
ఎలైన్‌ థాంప్సన్‌ హెరా , జమైకా జాతీయ పతాకంతో షెల్లీ, ఎలైన్, షెరికా

స్వర్ణం నిలబెట్టుకున్న ఎలైన్‌

33 ఏళ్ల ఒలింపిక్‌ రికార్డు బద్దలు

షెల్లీకి రజతం, షెరికాకు కాంస్యం

స్ప్రింట్‌ రేసుల్లో జమైకా మహిళా అథ్లెట్లు మరోసారి తమ ఆధిపత్యం చాటుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల రేసులో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకొని క్లీన్‌స్వీప్‌ చేశారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లోనూ జమైకా తొలిసారి క్లీన్‌స్వీప్‌ చేసింది. 1928 ఒలింపిక్స్‌లో తొలిసారి మహిళల 100 మీటర్ల రేసును ప్రవేశపెట్టగా ఇప్పటి వరకు జమైకా మాత్రమే రెండు పర్యాయాలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెల్చుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ ఎలైన్‌ థాంప్సన్‌ హెరా ‘టోక్యో’లోనూ మెరుపు వేగంతో దూసుకుపోయి రెండోసారి ఒలింపిక్‌ చాంపియన్‌గా నిలిచింది. జమైకాకే చెందిన షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌కు రజతం... షెరికా జాక్సన్‌కు కాంస్యం లభించాయి.

టోక్యో: స్ప్రింట్‌ బుల్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ ‘రియో’ ఒలింపిక్స్‌లో ఆగిపోయాడు. కానీ... జమైకన్లు మాత్రం సాగిపోతున్నారు. పరుగు పెడితే... పతకం మెడలో పడిందా... లేదా అన్నట్లు ట్రాక్‌పై చెలరేగిపోతున్నారు. మహిళల 100 మీటర్ల పరుగులో అయితే ఎలైన్‌ థాంప్సన్‌ హెరా... బోల్ట్‌లా కాదు ముమ్మాటికి బోల్ట్‌నే తలపించింది. కొత్త ఒలింపిక్‌ రికార్డుతో స్వర్ణం చేజిక్కించుకుంది. ట్రాక్‌పై ఆమె మెరుపు వేగంతో దూసుకొచ్చేసింది. ఆమెకు సమీప దూరంలో ఎవరూ లేరు. ఈ 100 మీటర్ల షార్ట్‌ డిస్టెన్స్‌లో ఇంత వ్యత్యాసం చూపడం ఒక్క బోల్ట్‌కే సాధ్యమైంది. ఇప్పుడదే వేగాన్ని ఎలైన్‌ థాంప్సన్‌ కనబరిచింది. మిగిలిన పతకాలను కూడా ఆమె సహచరులే పట్టేశారు. దీంతో ఈ ఈవెంట్‌ను జమైకన్లే క్లీన్‌స్వీప్‌ చేశారు.  

     శనివారం జరిగిన మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో ఎలైన్‌ థాంప్సన్‌ పోటీని అందరికంటే ముందుగా 10.61 సెకన్లలో ముగించింది. తద్వారా ఆమె 33 ఏళ్ల ఒలింపిక్‌ రికార్డును తిరగరాసింది. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో అమెరికాకు చెందిన ఫ్లారెన్స్‌ గ్రిఫిత్‌ జాయ్‌నెర్‌ నెలకొల్పిన 10.62 సెకన్ల రికార్డు 0.01 సెకను తేడాతో ఎలైన్‌ తన పేర లిఖించుకుంది. ఈ ఈవెంట్‌లో షెల్లీ అన్‌ ఫ్రేజర్‌ (10.74 సెకన్లు) రజతం గెలుపొందగా, షెరికా జాక్సన్‌ (10.76 సెకన్లు) కాంస్యం నెగ్గింది.  

     బీజింగ్‌ ఒలింపిక్స్‌ (2008)లోనూ జమైకన్‌ అమ్మాయిలు ఇలాగే క్లీన్‌స్వీప్‌ చేశారు. కానీ ఆనాడు ఉసేన్‌ బోల్ట్‌ రికార్డు (9.69 సెకన్లు) ప్రదర్శన ముందు అమ్మాయిల ఘనత చిన్నబోయింది. అప్పుడు షెల్లీ అన్‌ ఫ్రేజర్‌ బంగారం గెలిచింది. షెల్లీ మళ్లీ లండన్‌ (2012)లోనూ స్వర్ణం నిలబెట్టుకుంది. మొత్తం మీద ఆమె ఖాతాలో నాలుగు (2 స్వర్ణాలు, 1 రజతం, రియోలో కాంస్యం) ఒలింపిక్‌ పతకాలున్నాయి. ఈ జమైకన్‌ లేడి చిరుతలకు క్లీన్‌స్వీప్‌ చేసేందుకు మరో అవకాశం 200 మీటర్ల స్పింట్‌ రేసు కల్పించనుంది. పైగా ఆ ఈవెంట్‌లో ఎలైన్‌ థాంప్సన్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌. 200 మీటర్ల పరుగులో కూడా పతకాలన్నీ ఊడ్చేస్తే స్ప్రింట్‌లో జమైకన్లకు తిరుగుండదేమో!

నేడే పురుషుల 100 మీటర్ల ఫైనల్‌
అందరూ గుడ్లప్పగించి చూసే అథ్లెటిక్‌ ఈవెంట్‌ పురుషుల 100 మీటర్ల పరుగు పోటీ నేడు జరగనుంది. బీజింగ్‌ (2008) నుంచి రియో (2016) దాకా ఉసేన్‌ బోల్ట్‌ వేగమే కనబడిన ఒలింపిక్స్‌లో ఇప్పుడు కొత్త చాంపియన్‌ స్ప్రింటర్‌ను చూడబోతున్నాం. జమైకన్‌ దిగ్గజం బోల్ట్‌ రిటైరైన తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్స్‌లో స్ప్రింట్‌ను శాసించేది ఎవరో కొన్ని గంటల్లోనే తేలనుంది. ఆదివారమే జరిగే మూడు సెమీఫైనల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు... ఆ తర్వాత అత్యుత్తమ సమయం నమోదు చేసిన మరో ఇద్దరు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. మొత్తం ఎనిమిది మంది ఫైనల్లో పోటీపడతారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం గం. 6.20 ఫైనల్‌ పోటీ జరుగుతుంది.

ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణాన్ని నిలబెట్టుకున్న నాలుగో అథ్లెట్‌ ఎలైన్‌. గతంలో వ్యోమియా టైయస్‌ (అమెరికా; 1964, 1968)... గెయిల్‌ డెవర్స్‌ (అమెరికా; 1992, 1996)... షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ (జమైకా; 2008, 2012) మాత్రమే ఈ ఘనత సాధించారు.
 

మరిన్ని వార్తలు