స్వితోలినా కూడా తప్పుకుంది

8 Aug, 2020 08:39 IST|Sakshi

న్యూయార్క్‌: కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని... ప్రతిష్టాత్మక యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ నుంచి వైదొలుగుతున్న స్టార్‌ క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు దూరం కాగా... తాజాగా మహిళల సింగిల్స్‌ జాబితాలో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌), ఏడో ర్యాంకర్‌ కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌) కూడా చేరారు.

‘సురక్షిత వాతావరణంలో యూఎస్‌ ఓపెన్‌ను నిర్వహించేందుకు నిర్వాహకులు తీసుకుంటున్న చర్యలను నేను గౌరవిస్తున్నాను. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు ప్రయాణించి నాతోపాటు నా సహాయక సిబ్బందిని ప్రమాదంలో నెట్టాలని భావించడంలేదు’ అని గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరిన స్వితోలినా వ్యాఖ్యానించింది. ‘కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ముందుగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాక 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని మా దేశ ప్రధాని కోరారు. దాంతో నాకిష్టమైన ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ క్లే కోర్టు టోర్నీకి సన్నాహాలు దెబ్బతింటాయి’ అని 28 ఏళ్ల కికి బెర్‌టెన్స్‌ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటిపోగా... లక్షా 60 వేల మంది మరణించారు. యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు న్యూయార్క్‌లో జరుగుతుంది. 

మరిన్ని వార్తలు