US Open 2021: విజేతగా 18 ఏళ్ల ఎమ్మా రెడుకాను.. షరపోవా తర్వాత ఆ ఘనత

12 Sep, 2021 07:25 IST|Sakshi

US Open 2021 Winner Emma Raducanu:  టెన్నిస్‌ చరిత్రలో పెనుసంచలనం చోటు చేసుకుంది. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో పద్దెనిమిదేళ్ల ఎమ్మా రెడుకాను విజేతగా ఆవిర్భవించింది.  ఈ బ్రిటిష్‌ టెన్నిస్‌ సెన్సేషన్‌..  19 ఏళ్ల కెనడా ప్లేయర్‌ లేలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. 

న్యూయార్క్‌లోని కరోనా పార్క్‌ ‘అర్థర్‌ ఆషే స్టేడియం’లో భారత కాలమానం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి దాటాక(ఆదివారం ఉదయం) US Open 2021 మహిళల ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది.  సెట్‌ కూడా ఓడిపోకుండా టీనేజర్‌ ఎమ్మా రెడుకాను మ్యాచ్‌పై పట్టు సాధించి గెలుపును ఖాతాలో వేసుకుంది. అత్యంత చిన్నవయస్సులోనే గ్రాండ్‌స్లామ్‌ వేటలో ఫైనల్‌లో విజేతగా ఆవిర్భవించింది. అంతేకాదు ఈ గ్రాండ్‌ విక్టరీతో తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గతంలో మరియా షరపోవా(17 ఏళ్ల వయసులో వింబుల్డన్‌ విజేత- 2004) తర్వాత ఏదేని ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఈ రికార్డు సాధించిన టీనేజర్‌గా గుర్తింపు ఇప్పుడు ఎమ్మా ఘనత దక్కించుకుంది.

కాగా, ఎమ్మా రెడుకాను కెరీర్‌లో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ విజయాలేవీ లేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఆమె సక్సెస్‌ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.   ఇదిలా ఉంటే బ్రిటిష్‌ ప్లేయర్‌ వర్జీనియా వేడ్  1977లో వింబుల్డన్‌  గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన తర్వాత ఇప్పుడు.. ఎమ్మా రెడుకాను ఈ ఘనత సాధించింది.

చదవండి: స్వర్ణ పతక విజేతను ఓడించి.. ఫైనల్‌లో జొకోవిచ్‌

మరిన్ని వార్తలు