నీ గురించి నువ్వు చూసుకో ముందు! ఆ తర్వాత పక్కవాళ్ల గురించి మాట్లాడు! పిరికివాడా!

15 Oct, 2022 16:23 IST|Sakshi
మిచెల్‌ స్టార్క్‌ (PC: Mitchell Starc Instagram)

టీమిండియా బౌలర్‌ దీప్తి శర్మను ఉద్దేశించి ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘క్రికెట్‌ నిబంధనలు తెలియకుండానే ‘స్టార్‌ బౌలర్‌’గా ఎదిగావా?.. అయినా నీ ఆట గురించి నువ్వు చూసుకోకుండా పక్కవాళ్ల గురించి కామెంట్లు చేయడం దేనికి’’ అంటూ భారత జట్టు అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. ఇంగ్లండ్‌కు మద్దతుగా నిలవాలనుకుంటే అలాగే చేయొచ్చు.. కానీ అందుకు దీప్తి పేరు ప్రస్తావించాల్సి అవసరం లేదని మండిపడుతున్నారు.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను దీప్తి శర్మ రనౌట్‌(మన్కడింగ్‌) చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బ్రిటిష్‌ మీడియా సహా పలువురు క్రీడా విశ్లేషకులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అదే స్థాయిలో దీప్తి శర్మకు మద్దతు కూడా లభించింది. నిబంధనలకు అనుగుణంగానే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఆమె రనౌట్‌ చేసిందని పలువురు అండగా నిలబడ్డారు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో శుక్రవారం నాటి టీ20 మ్యాచ్‌ సందర్భంగా మిచెల్‌ స్టార్క్‌కు.. జోస్‌ బట్లర్‌ను రనౌట్‌ చేసే అవకాశం లభించింది. కానీ అతడు.. ఇంగ్లండ్‌ సారథికి కేవలం వార్నింగ్‌ ఇచ్చి వదిలిపెట్టాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ‘‘నేనేమి దీప్తిని కాదు.. మన్కడింగ్‌ చేయడానికి.. కానీ ఇది రిపీట్‌ చేయకు బట్లర్‌'’ అని వ్యాఖ్యానించడం అతడిపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

ఇక ఈ విషయంపై భారత మాజీ ఆల్‌రౌండర్‌ హేమంగ్‌ బదాని స్పందిస్తూ.. ‘‘స్టార్క్‌ నువ్వింకా ఎదగాలి! నీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు. ఆటలో భాగంగా దీప్తి చేసిన పని నిబంధనలకు అనుగుణంగానే ఉంది. నువ్వు ఒకవేళ నాన్‌స్ట్రైకర్‌ను హెచ్చరించాలని భావిస్తే అలాగే చేయి.. అది నీ సొంత నిర్ణయం. అంతేగానీ మధ్యలో దీప్తి పేరును ఎందుకు లాగావు? క్రికెట్‌ ప్రపంచం నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అంటూ మిచెల్‌ స్టార్క్‌ను విమర్శించాడు.

ఈ మేరకు బదాని చేసిన ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు.. ‘‘అవును.. నువ్వు దీప్తిశర్మవు కావు. కాలేవు. ఎందుకంటే నీకు రూల్స్‌ ఫాలో అయ్యే ధైర్యం లేదు కదా! అయినా తనేదో నేరం చేసినట్లు నువ్వు తన పేరును వాడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని స్టార్క్‌ను ఏకిపారేస్తున్నారు.

చదవండి: Women Asia Cup Final: ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్‌ విజేతగా భారత్‌
 Runout controversy: అప్పటికే పలుమార్లు హెచ్చరించా: రనౌట్‌ వివాదంపై దీప్తి శర్మ వివరణ
 

మరిన్ని వార్తలు