ENG Vs IND 4th Test Day 4: ఇంగ్లండ్‌ స్కోరు 77/0, నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్‌ ఓపెనర్లు

5 Sep, 2021 23:57 IST|Sakshi

విజయానికి పది వికెట్ల దూరంలో టీమిండియా..
►భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. ఇంగ్లండ్‌ ఓపెనర్లు వికెట్టు నష్టపోకుండా 77 పరుగులను రాబట్టారు. ప్రస్తుతం రోరీ బర్న్స్‌ 31, హసీబ్‌ హమీద్‌ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి టీమిండియా పది వికెట్ల దూరంలో ఉండగా..ఇంగ్లండ్‌ జట్టు 291 పరుగుల దూరంలో ఉంది. రేపు ఒక్క రోజు మాత్రమే ఆట మిగిలి ఉంది.

ఇంగ్లండ్‌ స్కోరు 15 ఓవర్లలో 37/0 
► టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఆచితూచి ఆడుతోంది. 15 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. రోరీ బర్న్స్‌ 18, హసీబ్‌ హమీద్‌ 17 పరుగులతో ఆడుతున్నారు.   

టీమిండియా 466 ఆలౌట్‌.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 368
► ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగోటెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లండ్‌ ముందు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంత్‌, శార్దూల్‌లు ఔటైన తర్వాత ఉమేశ్‌ యాదవ్‌(25), జస్‌ప్రీత్‌ బుమ్రా( 24) కొన్ని చూడచక్కని షాట్లతో అలరించారు. ఇద్దరి మధ్య 37 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. బుమ్రా ఔటైన కాసేపటికే వెనువెంటనే ఉమేశ్‌, సిరాజ్‌లు వరుసగా ఔట్‌ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసింది. టీమిండియా బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ 127, పుజారా 61, శార్దూల్‌ 60, పంత్‌ 50 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 3, రాబిన్‌సన్‌, మొయిన్‌ అలీ చెరో రెండు వికెట్లు తీయగా.. రూట్‌, అండర్సన్‌, ఓవర్టన్‌ తలా ఒక వికెట్‌ తీశారు. 

టీ విరామం.. 346 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
► ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా టీ విరామ సమయానికి 8 వికెట్ల నష్టానికి 445 పరుగులు చేసింది. బుమ్రా 19, ఉమేశ్‌ యాదవ్‌ 13 పరుగులతో ఆడుతున్నారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు టీమిండియా 346 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. 
 రిషబ్‌ పంత్‌ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. అర్థశతకం సాధించిన వెంటనే మొయిన్‌ అలీ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అంతకముందు శార్దూల్‌ ఠాకూర్‌ 60 పరుగులు చేసి రూట్‌ బౌలింగ్‌లో ఓవర్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు భారత్‌ 315 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

శార్దూల్‌ ఠాకూర్‌ వరుసగా రెండో ఫిప్టీ.. 300 పరుగుల ఆధిక్యం
► టీమిండియా బ్యాట్స్‌మన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్‌ మంచి ఆటతీరును కనబరిచాడు. 65 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 పరుగులు సాధించిన శార్దూల్‌ వన్డే తరహాలో వేగంగా ఆడాడు. కాగా శార్దూల్‌కు ఇది వరుసగా రెండో అర్థ శతకం. ఇదే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ శార్దూల్‌ అర్థశతకంతో మెరిశాడు. రిషబ్‌ పంత్‌ కూడా 47 పరుగులతో చక్కగా సహకరిస్తున్నాడు. ప్రస్తుతం భారత్‌ 306 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. టీమిండియా స్కోరు 405/6 గా ఉంది.

లంచ్‌ విరామం.. టీమిండియా 329/6
► లంచ్‌ విరామ సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. పంత్‌ 16, శార్దూల్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 230 పరుగుల ఆధిక్యంలో​ ఉంది.

రహానే డకౌట్‌.. ఐదో వికెట్‌ డౌన్‌
► టీమిండియా బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిగానే కదిలిన రహానే 8 బంతులెదుర్కొని వోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయాయి. ప్రస్తుతం 197 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా స్కోరు 296/5 గా ఉంది. కోహ్లి 40, పంత్‌ 2 పరుగులతో పరుగులతో క్రీజులో ఉన్నారు.

జడేజా ఔట్‌.. టీమిండియా 294/4
► ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభం అయిన కాసేపటికే టీమిండియా జడేజా రూపంలో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన జడేజా క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 197 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా స్కోరు 296/4 గా ఉంది. కోహ్లి 40, రహానే (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

లండన్‌: టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆట నాలుగో రోజుకు చేరింది. మూడోరోజు పూర్తి ఆధిపత్యం చూపిన టీమిండియా చివర్లో వెనువెంటనే వికెట్లు కోల్పోయినప్పటికి కోహ్లి, జడేజాలు జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించారు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది.  కోహ్లి 22, జడేజా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఓవరాల్‌గా 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగోరోజు ఆటలో టీమిండియా రెండు సెషన్ల పాటు నిలబడి బ్యాటింగ్‌ చేస్తే మ్యాచ్‌పై పట్టు చిక్కినట్టే. ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు