IND Vs ENG 5th Test: కోవిడ్‌ నుంచి కోలుకోని రోహిత్‌.. టీమిండియా కెప్టెన్‌ ఎవరంటే..?

29 Jun, 2022 20:34 IST|Sakshi

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సి ఉన్న రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఎవరనే అంశంపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని సమాచారం. 

ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రోహిత్ ఆరోగ్యం విషయమై ఇవాళ (జూన్‌ 29) జరిగిన సమావేశంలో జట్టు యాజమాన్యం ఈ మేరకు నిర్ణయించిందని, ఈ విషయాన్ని హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వయంగా బుమ్రాకు తెలియజేశాడని ఓ ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. 

కాగా, గత ఆదివారం లీస్టర్‌షైర్‌తో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ కోవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. రోహిత్‌ ఆరోగ్యం విషయంపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ ఎవరనే అంశంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. కొందరు పంత్‌ అంటే, మరికొందరు అశ్విన్‌ అంటూ సోషల్‌మీడియాను హోరెత్తించారు.

మ్యాచ్‌ మరో రెండ్రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో బీసీసీఐ కెప్టెన్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.  ఒకవేళ బుమ్రా టీమిండియా సారధ్య బాధ్యతలు చేపడితే ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంటాడు. దిగ్గజ బౌలర్‌ కపిల్‌ దేవ్‌ తర్వాత భారత జట్టుకు సారధిగా వ్యవహరించిన రెండో పేసర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. 
చదవండి: మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు.. గుజరాత్‌ ప్లేయర్‌కు బంపర్‌ ఆఫర్‌

మరిన్ని వార్తలు