ENG VS IRE One Off Test: 93 ఏళ్ల కిందటి  బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌

3 Jun, 2023 17:34 IST|Sakshi

లార్డ్స్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 178 బంతుల్లో 24 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 182 పరుగులు చేసిన డకెట్‌.. 93 ఏళ్ల కిందట క్రికెట్‌ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌ నెలకొల్పిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. 

లార్డ్స్‌ మైదానంలో జరిగిన టెస్ట్‌ల్లో వేగవంతమైన 150 పరుగుల రికార్డు డాన్‌ బ్రాడ్‌మన్‌ పేరిట ఉండేది. 1930లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌మన్‌ 166 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. నిన్నటి వరకు లార్డ్స్‌ టెస్ట్‌ల్లో ఇదే వేగవంతమైన 150గా ఉండేది. అయితే నిన్నటి ఇన్నింగ్స్‌తో డకెట్‌ ఈ రికార్డును బద్దలు కొట్టి నయా రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. డకెట్‌ కేవలం 150 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి బ్రాడ్‌మన్‌ రికార్డుకు ఎసరు పెట్టాడు. 

ఓవరాల్‌గా ఫాస్టెస్ట్‌ 150  రికార్డు విషయానికొస్తే.. ఈ రికార్డు న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ పేరిట ఉంది. మెక్‌కల్లమ్‌ 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 103 బంతుల్లోనే 150 రన్స్‌ బాదాడు. ఆతర్వాత మహేళ జయవర్ధనే 111 బంతుల్లో, రాయ్‌ ఫ్రెడ్రిక్స్‌ 113 బంతుల్లో, హ్యారీ బ్రూక్‌ 115 బంతుల్లో 150 పరుగులు బాదారు.   

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తడబడుతున్న ఐర్లాండ్‌ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 141 పరుగులు వెనుకపడి ఉంది. 

అంతకుముందు ఓలీ పోప్‌ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో, బెన్‌ డకెట్‌ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్‌) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీనికి ముందు స్టువర్ట్‌ బ్రాడ్‌ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది.

చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్

మరిన్ని వార్తలు