ENG VS IRE One Off Test: చేతులెత్తేస్తుందనుకుంటే చుక్కలు చూపిస్తుంది..!

3 Jun, 2023 19:48 IST|Sakshi

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌ ప్రతిఘటిస్తుంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఇంగ్లండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. తొలుత హ్యారీ టెక్టార్‌ (51), లోర్కాన్‌ టక్కర్‌ (44) నిలకడగా ఆడి ఇంగ్లీష్‌ బౌలర్లకు విసుగు తెప్పిస్తే.. ఆతర్వాత ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌​కు వచ్చిన ఆండీ మెక్‌బ్రైన్‌ (71 నాటౌట్‌), తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన మార్క్‌ అదైర్‌ (88 నాటౌట్‌) ధాటిగా బ్యాటింగ్‌ చేస్తూ ఇంగ్లండ్‌ బౌలర్లను డిఫెన్స్‌లోకి నెట్టేస్తున్నారు.

వీరిద్దరు ప్రతిఘటిస్తుండటంతో ఐర్లాండ్‌ 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 352 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఐర్లాండ్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు కేవలం 27 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ను అధిగమించి వారికి కొద్దో గొప్పో టార్గెట్‌ సెట్‌ చేసినా అది కచ్చితంగా ఇంగ్లండ్‌ బౌలింగ్‌ బలహీనతలను ఎత్తి చూపినట్లవుతుంది. 

అంతకుముందు ఓలీ పోప్‌ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో, బెన్‌ డకెట్‌ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్‌) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేయగా.. స్టువర్ట్‌ బ్రాడ్‌ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది.

చదవండి: 93 ఏళ్ల కిందటి బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌

మరిన్ని వార్తలు