ENG VS NZ 1s Test: నిప్పులు చెరిగిన బ్రాడ్‌.. ఓటమి దిశగా కివీస్‌

18 Feb, 2023 15:13 IST|Sakshi

2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌.. మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో (డే అండ్‌ నైట్‌) విజయం దిశగా సాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిధ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (10-5-21-4) నిప్పులు చెరగడంతో మూడో రోజు ఆఖరి సెషన్‌లో కివీస్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది.

న్యూజిలాండ్‌ గెలవాలంటే ఇంకా 331 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. క్రీజ్‌లో డారిల్‌ మిచెల్‌ (13),ర మైఖేల్‌బ్రేస్‌వెల్‌ (25) ఉన్నారు. బ్రాడ్‌ 4 వికెట్లతో విజృంభించగా.. రాబిన్సన్‌ ఓ వికెట్‌ తీసుకున్నాడు. న్యూజిలాండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో లాథమ్‌ (15), డెవాన్‌ కాన్వే (2), విలియమ్సన్‌ (0), హెన్రీ నికోల్స్‌ (7), టామ్‌ బ్లండెల్‌ (1) దారుణంగా విఫలమయ్యారు. బ్రాడ్‌ పడగొట్టిన 4 వికెట్లు క్లీన్‌ బౌల్డ్‌ కావడం విశేషం.

అంతకుముందు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌటైంది. రూట్‌ (57), హ్యారీ బ్రూక్‌ (54), ఫోక్స్‌ (51) హాఫ్‌సెంచరీలతో రాణించగా.. ఓలీ పోప్‌ (49), స్టోక్స్‌ (31), రాబిన్సన్‌ (39), జాక్‌ క్రాలే (28), బెన్‌ డక్కెట్‌ (25) పర్వాలేదనిపించారు. కివీస్‌ బౌలర్లలో టిక్నర్‌, బ్రేస్‌వెల్‌ చరో 3 వికెట్లు తీయగా.. వాగ్నర్‌, కెగ్గెలిన్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.

దీనికి ముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 325 పరగుల స్కోర్‌కు న్యూజిలాండ్‌ ధీటుగానే బదులిచ్చింది. టామ్‌ బ్లండెల్‌ (138) సెంచరీతో కదం తొక్కగా.. కాన్వే (77) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రాబిన్సన్‌ 4, ఆండర్సన్‌ 3, బ్రాడ్‌, జాక్‌ లీచ్‌, స్టోక్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. డక్కెట్‌ (84), హ్యారీ బ్రూక్‌ (89) భారీ అర్ధశతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 325 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. వాగ్నర్‌ 4, సౌథీ, కుగ్గెలిన్‌ తలో 2, టిక్నర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. మరో వికెట్‌ ఉండగానే ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు