Matthew Potts: వారెవ్వా.. అరంగేట్రంలోనే అదుర్స్‌.. ఇచ్చిన పరుగులు 13.. పడగొట్టిన వికెట్లు 4!

2 Jun, 2022 20:59 IST|Sakshi

England Vs New Zealand 1st Test 2022 Day 1: ఇంగ్లండ్‌ పేసర్‌ మాథ్యూ పాట్స్‌ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను అవుట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తన వికెట్ల ఖాతా తెరిచాడు. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు గురువారం ఆరంభమైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక కివీస్‌ ఇంగ్లండ్‌ బౌలర్ల దాటికి 132 పరుగులకే కుప్పకూలింది. తొలి రోజే ఇంగ్లండ్‌ ఈ మేర కివీస్‌కు చుక్కలు చూపించిందంటే.. అందులో సింహభాగం మాథ్యూ పాట్స్‌కే చెందుతుంది. సీనియర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ ఓపెనర్ల వికెట్లు కూల్చగా.. మ్యాటీ.. విలియమ్సన్‌ వికెట్‌తో బ్రేక్‌ ఇచ్చాడు. అదే విధంగా డారిల్‌ మిచెల్‌, టామ్‌ బ్లండల్‌, అజాజ్‌ పటేల్‌ను పెవిలియన్‌కు పంపాడు.

కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 9.2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన మ్యాటీ..13 పరుగులు మాత్రమే ఇచ్చి ఇలా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. దీంతో ఈ యువ బౌలర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. దుర్హమ్‌కు చెందిన మాథ్యూ పాట్స్‌ 1998లో జన్మించాడు. 2017లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. బ్యాట్‌తోనూ రాణించగల మ్యాటీ.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఒక అర్ధ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు.

మొత్తంగా 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ కొత్త టెస్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ నమ్మకం గెలుచుకున్న మ్యాటీ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్‌లోనే తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రశంసలు అందుకుంటున్నాడు. 

చదవండి 👇
అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్‌ ఎదురుగా ఉన్నాడంటే అంతే ఇక: జయవర్ధనే
IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్‌ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు!

మరిన్ని వార్తలు