ENG VS NZ 1st Test: బెన్‌ స్టోక్స్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌.. తొలి రోజే.. ఓ వికెట్‌ ఉన్నా..!

16 Feb, 2023 14:23 IST|Sakshi

2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌.. మౌంట్‌ మాంగనూయ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 16) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో (డే అండ్‌ నైట్‌ టెస్ట్‌) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తొలి రోజు.. అది కూడా కేవలం 58.2 ఓవర్లు మాత్రమే ఆడి, ఓ వికెట్‌ ఉన్నా​ తొలి ఇన్నింగ్స్‌ను 325 పరుగుల (9 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్‌ చేసింది.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం పట్ల క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో 20.. 30 పరుగులు అదనంగా చేసే అవకాశం ఉన్నా ఎందుకు అంత ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇది టెస్ట్‌ క్రికెట్‌ అనుకుంటున్నారా లేక ఇంకేమైనానా అంటూ ఇంగ్లండ్‌ నిర్ణయాన్ని దుయ్యబడుతున్నారు.

టెస్ట్‌లను కూడా టీ20ల్లా ఆడాలనుకుంటే, కేవలం వాటికే పరిమితం కావచ్చు కాదా అంటూ సలహాలిస్తున్నారు. ఇంగ్లండ్‌ నిర్ణయం మిస్‌ ఫైర్‌ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇంగ్లండ్‌ తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల టెస్ట్‌ క్రికెట్‌ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని మండిపడుతున్నారు. సంప్రదాయ టెస్ట్‌ మ్యాచ్‌లను బజ్‌బాల్‌ అనే అతిగతి లేని విధానాన్ని అమలు చేసి చంపేస్తున్నారని తూర్పారబెడుతున్నారు. 5 రోజుల టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడే ఓపిక లేకపోతే, ఇంట్లోనే కూర్చోవాలి కానీ, ఆటకు కళంకం తేవడమెందుకని నిలదీస్తున్నారు. 

కాగా, ఇంగ్లండ్‌ టీమ్‌ గత కొంతకాలంగా టెస్ట్‌ క్రికెట్‌లో వేగం పెంచిన విషయం విధితమే. ఫలితం త్వరగా రాబట్టాలనే ఉద్దేశంతో ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగడమే వారి ప్రణాళిక. దీనికి వాళ్లు బజ్‌బాల్‌ అప్రోచ్‌ అనే పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి వారు ఈ విధానంలో టెస్ట్‌లు ఆడి 100 శాతం సఫలమయ్యారు. అయితే సంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌ వాదులు ఇంగ్లండ్‌ అమలు చేస్తున్న బజ్‌బాల్‌ విధానాన్ని తప్పుపడుతున్నారు. ఇలా చేయడం వల్ల టెస్ట్‌ క్రికెట్‌ చచ్చిపోతుందని వాపోతున్నారు. ఇప్పటికే టీ20ల వల్ల టెస్ట్‌ క్రికెట్‌ కళ తప్పిందని అంటున్నారు.

ఇదిలా ఉంటే, కివీస్‌తో తొలి టెస్ట్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. రాకెట్‌ వేగంతో పరుగులు సాధించి 325/9 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. బెన్‌ డక్కెట్‌ (68 బంతుల్లో 84; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 89; 15 ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధశతకాలు సాధించి తృటిలో సెంచరీలు చేసే అవకాశాన్ని కోల్పోయారు.

ఓలీ పోప్‌ (42), బెన్‌ ఫోక్స్‌ (38) సైతం బౌండరీలతో విరుచుకుపడి జట్టు వేగంగా పరుగులు సాధించడానికి దోహదపడ్డారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసే సమయానికి రాబిన్సన్‌ (15 నాటౌట్‌; 3 ఫోర్లు) జోరుమీదుండగా.. జేమ్స్‌ ఆండర్సన్‌ బరిలోకి దిగలేదు. కివీస్‌ బౌలర్లలో వాగ్నర్‌ 4, సౌథీ, కుగ్గెలెన్‌  తలో 2, టిక్నర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వెనుక మరో కోణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పిచ్‌ పేసర్లకు సహకరించడం మొదలుపెట్టిందని తెలిసి వారు హడావుడిగా పరుగులు సాధించి, ప్రత్యర్ధిని బరిలోకి ఆహ్వానించారని సమాచారం. డిన్నర్‌ బ్రేక్‌ తర్వాత ఇంగ్లండ్‌ ఆఖరి 4 వికెట్లను 46 పరుగుల వ్యవధిలో కోల్పోవడం వారి ప్రణాళికకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఇంగ్లండ్‌ వ్యూహాలు కూడా ఫలించాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 37 పరగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. కాన్వే (17), వాగ్నర్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. 

మరిన్ని వార్తలు