Kane Williamson: న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. కెప్టెన్‌కు కరోనా.. రెండో టెస్టు నుంచి అవుట్‌!

10 Jun, 2022 09:26 IST|Sakshi
కేన్‌ విలియమ్సన్‌(PC: BLACKCAPS/NZ Cricket Twitter)

England vs New Zealand Test Series 2022: ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కరోనా బారిన పడ్డాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు విలియమ్సన్‌ కోవిడ్‌ లక్షణాలతో బాధపడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం నిర్వహించిన రాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఐదు రోజుల పాటు విలియమ్సన్‌ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు.

ఈ నేపథ్యంలో నాటింగ్‌హామ్‌ వేదికగా ట్రెంట్‌ బ్రిడ్జ్‌ మైదానంలో శుక్రవారం(జూన్‌ 10) ప్రారంభమయ్యే రెండో టెస్టుకు అతడు దూరం కానున్నాడు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్‌ స్థానంలో టామ్‌ లాథమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ ధ్రువీకరించాడు. విలియమ్సన్‌ స్థానాన్ని హమీష్‌ రూథర్‌ఫర్డ్‌తో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నాడు. 

ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘కీలక మ్యాచ్‌లకు ముందు ఇలా తనకు తాను జట్టుకు దూరమవ్వడాన్ని విలియమ్సన్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు ఎంతగా నిరాశ చెందాడో మా అందరికీ తెలుసు. హమీష్‌ విలియమ్సన్‌ స్థానంలో జట్టులోకి వస్తాడు’’ అని గ్యారీ పేర్కొన్నాడు.

కాగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ నిమిత్తం కివీస్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో విలియమ్సన్‌ బృందం ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్‌ తర్వాత గాయం కారణంగా కివీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.

చదవండి: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే.. అయితే: పంత్‌
Avesh Khan: వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్‌ రెండు ముక్కలయ్యింది

మరిన్ని వార్తలు