Harry Brook: ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. తీసిపారేయొద్దు ఇదీ రికార్డే

1 Dec, 2022 19:10 IST|Sakshi

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం ఎంత కష్టమో.. ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టడం కూడా అంతే కష్టం. ఎందుకంటే ప్రతీ బంతి సిక్సర్‌ లేదా బౌండరీ వెళ్లాలని రూల్‌ లేదుగా. మరి ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు అనేది తీసిపారేయాల్సిన అంశం కాదు. దీనిని కూడా ఒక రికార్డు కింద పరిగణించొచ్చని అభిమానులు పేర్కొంటున్నారు.

తాజాగా పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి విధ్వంసం సృష్టించాడు. బ్రూక్‌ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ 68వ ఓవర్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షకీల్‌ వేశాడు. మొదటి బౌండరీ మిడ్‌ వికెట్‌ మీదుగా తరలించిన బ్రూక్స్‌ ఆ తర్వాత వరుసగా ఎక్స్‌ట్రా కవర్స్‌, పాయింట్‌, మిడాన్‌, ఎక్స్‌ట్రా కవర్స్‌, చివరి బంతిని మళ్లీ మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీ తరలించాడు. అలా ఆరు బంతుల్లో ఆరు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్న బ్రూక్‌ స్కోరు ఒక్క ఓవర్‌ ముగిసేలోపే 60 నుంచి 84 పరుగులకు చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక హ్యారీ బ్రూక్‌ వన్డే తరహాలో 80 బంతుల్లోనే శతకం మార్కును అందుకోవడం విశేషం. ఇక ఇంగ్లండ్‌ ఆడుతుంది టెస్టు మ్యాచ్‌ లేక వన్డేనా అన్న తరహాలో బ్యాటర్లు రెచ్చిపోయారు. పాక్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఇంగ్లండ్‌ బ్యాటర్లలో నలుగురు ఒకేరోజు శతకాలతో మెరవడం విశేషం. తొలుత ఓపెనర్లు జాక్‌ క్రాలీ(122 పరుగులు), బెన్‌ డకెట్‌(107 పరుగులు) చేయగా.. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన ఓలీ పోప్‌ 108 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇక వన్డే తరహాలో రెచ్చిపోయిన ఇంగ్లండ్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసేసమయానికి 75 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 506 పరుగుల భారీస్కోరు చేసింది. ప్రస్తుతం హ్యారీ బ్రూక్‌(81 బంతుల్లోనే 101 నాటౌట్‌) సూపర్‌ ఫాస్ట్‌తో బ్యాటింగ్‌ కొనసాగిస్తుండగా.. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

చదవండి: పిచ్చ కొట్టుడు కొడుతున్నారు.. డీఆర్‌ఎస్‌ కూడా లేకపాయే!

>
మరిన్ని వార్తలు