Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్‌ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా..

20 Jul, 2022 08:54 IST|Sakshi
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఖరి వన్డే ఆడిన బెన్‌స్టోక్స్‌(PC: ECB)

మొదటి వన్డేలో కేశవ్‌ మహరాజ్‌ బృందం గెలుపు

South Africa tour of England, 2022- ODI Series: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ప్రొటిస్‌ జట్టు 62 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 

కాగా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జూలై 19 నుంచి సెప్టెంబరు 12 వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఇందులో భాగంగా చెస్టర్‌ లీ స్ట్రీట్‌లోని రివర్‌సైడ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం (జూలై 19) మొదటి వన్డే జరిగింది.

అర్ధ శతకాలతో అదరగొట్టి..
టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ జానేమన్‌ మలన్‌ అర్ధ శతకం(57)తో రాణించగా.. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(19 పరుగులు) మాత్రం నిరాశపరిచాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాసీ వాన్‌ డర్‌ డసెన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఈ మ్యాచ్‌లో 117 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. ఇక ఎయిడెన్‌ మార్కరమ్‌ సైతం హాఫ్‌ సెంచరీ(77)తో చెలరేగాడు. మిల్లర్‌ 12 పరుగులతో అజేయంగా నిలవగా.. క్లాసెన్‌ 12 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ప్రొటిస్‌ జట్టు 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.

దెబ్బ కొట్టిన నోర్జే..
లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జేసన్‌ రాయ్‌(43), జానీ బెయిర్‌ స్టో(63) శుభారంభం అందించారు. ఇక జో రూట్‌ సైతం 86 పరుగులతో రాణించి ఇంగ్లండ్‌ శిబిరంలో జోష్‌ను రెట్టింపు చేశాడు. బెన్‌ స్టోక్స్‌(5), జోస్‌ బట్లర్‌(12) సహా ఇతర ఆటగాళ్లు చేతులెత్తేసినా 45వ ఓవర్‌ వరకు పట్టుదలగా నిలబడ్డాడు.

అయితే, అన్రిచ్‌ నోర్జే తన తన అద్భుతమైన బంతితో రూట్‌ను బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ పరాజయం ఖరారైంది. 46.5 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ కథ ముగిసిపోయింది. ఆతిథ్య జట్టు 271 పరుగులకు ఆలౌట్‌ కావడంతో కేశవ్‌ మహరాజ్‌ బృందం 62 పరుగులతో జయకేతనం ఎగురవేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు.. కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌ ఒకటి, లుంగి ఎంగిడి ఒకటి, తబ్రేజ్‌ షంసీ రెండు, మార్కరమ్‌ రెండు వికెట్లు తీయగా.. నోర్జే 8.5 ఓవర్ల బౌలింగ్‌లో 53 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రొటిస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన డసెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌కు ఇదే ఆఖరి వన్డే కావడం గమనార్హం. 2019 వన్డే వరల్డ్‌కప్‌ హీరో స్టోక్స్‌ ఇలా ఓటమితో వన్డే కెరీర్‌ ముగించడం గమనార్హం.

ఇంగ్లండ్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా 2022 మొదటి వన్డే:
►వేదిక: చెస్టెర్‌-లీ-స్ట్రీట్‌
►టాస్‌: దక్షిణాఫ్రికా- బ్యాటింగ్‌
►దక్షిణాఫ్రికా స్కోరు: 333/5 (50)
►ఇంగ్లండ్‌ స్కోరు: 271 (46.5)
►విజేత: 62 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: వాన్‌ డర్‌ డసెన్‌(117 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 133 పరుగులు)
►3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌: 1-0తో ముందంజలో పర్యాటక దక్షిణాఫ్రికా

చదవండి: Ben Stokes: 'కార్లు కాదు పరిగెత్తడానికి.. రిటైర్‌మెంట్‌తోనైనా మేల్కొనండి'

మరిన్ని వార్తలు