ENG VS SA 1st Test Day 1: నిప్పులు చెరిగిన సఫారీ పేసర్లు.. పేక మేడలా కూలిన ఇంగ్లీష్‌ బ్యాటర్లు

18 Aug, 2022 08:53 IST|Sakshi

లండన్‌‌‌: దక్షిణాఫ్రికాతో బుధవారం (ఆగస్ట్‌ 17) మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు తడబడింది. లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 32 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. ఒలీ పోప్‌ (61; 4 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించి ఇంగ్లండ్‌ పాలిట ఆపద్భాందవుడయ్యాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో పోప్‌తో పాటు కెప్టెన్‌ స్టోక్స్‌ (20) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశాడు. ఆట ముగిసే సమయానికి పోప్‌కు జతగా బ్రాడ్‌ (0) క్రీజ్‌లో ఉన్నాడు. 

నిప్పులు చెరిగిన పేసర్లు..
పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌.. టాస్‌ గెలిచాక ఏమాత్రం సంకోచించకుండా తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. సఫారీ పేసర్లు కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. 3వ ఓవర్లోనే ఓపెనర్‌ అలెక్స్‌ లీస్‌ (5)ను, ఆ తర్వాత 9వ ఓవర్లో మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలే (9) రబాడ పెవిలియన్‌కు పంపాడు.

ఆతర్వాత మరింత రెచ్చిపోయిన పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్‌ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. జో రూట్‌ (8)ను మార్కో జన్సెన్‌.. బెయిర్‌స్టో (0), బెన్‌ ఫోక్స్‌ (6), స్టోక్స్‌ (20)లను నోర్జే అద్భుతమైన బంతులతో పెవిలియన్‌కు సాగనంపారు. ముఖ్యంగా భీకరమైన ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోను నోర్జే క్లీన్‌ బౌల్డ్‌ చేసిన వైనం తొలి రోజు మొత్తానికే హైలైట్‌గా నిలిచిం‍ది.


చదవండి: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మరోసారి నిరూపితం

మరిన్ని వార్తలు