ENG VS SA 2nd ODI: సఫారీల భరతం పట్టిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. బట్లర్‌ సేన ఘన విజయం

23 Jul, 2022 12:29 IST|Sakshi

పర్యాటక దక్షిణాఫ్రికా చేతిలో తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్‌ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. 

వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లీష్‌ జట్టు 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయినా, ఆఖర్లో లివింగ్‌స్టోన్‌ (26 బంతుల్లో 38; ఫోర్‌, 3 సిక్సర్లు), సామ్‌ కర్రన్‌ (18 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల సాయంతో ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్‌ (4/36), నోర్జే (2/53), షంషి (2/39), కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌ (1/29)లు వికెట్లు సాధించారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్‌ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో సఫారీ జట్టు 20.4 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. ఆదిల్‌ రషీద్‌ (3/29), మొయిన్‌ అలీ (2/22), రీస్‌ టాప్లే (2/17), డేవిడ్‌ విల్లే (1/9), సామ్‌ కర్రన్‌ (1/5) సఫారీల భరతం పట్టారు. వీరి ధాటికి సఫారీల ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (40 బంతుల్లో 33), డేవిడ్‌ మిల్లర్‌ (12), ప్రిటోరియస్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే హెడింగ్లే వేదికగా జులై 24న జరుగనుంది. 
చదవండి: Ind Vs WI: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే!

మరిన్ని వార్తలు