Eng Vs SL: ఇంగ్లండ్‌–శ్రీలంక మూడో వన్డే రద్దు

5 Jul, 2021 07:23 IST|Sakshi
టామ్‌ కరన్‌(Courtesy: EC)

బ్రిస్టల్‌/ఇంగ్లండ్‌: శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డే వర్షంతో రద్దయింది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 2–0తోనే సిరీస్‌ను సరిపెట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 41.1 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది.  షనక (48 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్‌ టామ్‌ కరన్‌ (4/35) రాణించాడు. ఇన్నింగ్స్‌ విరామంలో మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.    

ఇక మ్యాచ్‌ అనంతరం ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మాట్లాడుతూ... ‘‘ఈరోజు కూడా మేమే పైచేయి సాధించాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఉండే మజాను ఆస్వాదించాం. మా ఆటగాళ్లంతా ఎంతో పట్టుదలగా నిలబడ్డారు. సమిష్టి కృషి​ వల్లే ఇదంతా సాధ్యమైంది. విల్లీ అద్భుతంగా రాణించాడు. వరల్డ్‌ కప్‌-2019లో అతడు భాగస్వామ్యం కాలేకపోవడం నిజంగా దురదృష్టకరం.

ఇక టామ్‌ కరన్‌ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్‌లో తను విఫలమైనా.. నేడు 4 వికెట్లతో సత్తా చాటాడు. అయితే, మేం డెత్‌ ఓవర్ల బౌలింగ్‌పై మరింత దృష్టి సారించాల్సి ఉంది. మిడిల్‌ ఓవర్స్‌లో కూడా నిలకడగా ఆడాల్సి ఉంది. ప్రపంచకప్‌నకు ముందే ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవాలి. పాకిస్తాన్‌తో ప్రారంభం కాబోయే సిరీస్‌ కోసం సన్నద్ధమవుతాం’’ అని చెప్పుకొచ్చాడు.   

మరిన్ని వార్తలు