ఈసారి 205తో సరి...

5 Mar, 2021 00:33 IST|Sakshi
ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ను అవుట్‌ చేసిన ఆనందంలో సిరాజ్‌

తొలి ఇన్నింగ్స్‌లో మళ్లీ కుప్పకూలిన ఇంగ్లండ్‌

స్టోక్స్‌ అర్ధ సెంచరీ

అక్షర్‌కు 4, అశ్విన్‌కు 3 వికెట్లు

భారత్‌ 24/1  

112 పరుగులతో పోలిస్తే 205 పరుగులు మెరుగైన స్కోరే కదా! ఇంగ్లండ్‌ జట్టు కూడా ఇదే తరహాలో సంతృప్తి చెందినట్లుంది. తీవ్ర విమర్శలు వచ్చిన గత పిచ్‌తో పోలిస్తే ఈసారి ఎలాంటి అనూహ్య టర్న్‌ కానీ బౌన్స్‌ కానీ లేవు. స్పిన్నర్లు కూడా మరీ ప్రమాదకరంగా ఏమీ కనిపించలేదు. అయినా సరే ఇంగ్లండ్‌కు పరుగులు చేయడం సాధ్యం కాలేదు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చి మంచి అవకాశాన్ని ఆ జట్టు వృథా చేసుకుంది.

బ్యాటింగ్‌ కు అనుకూలంగా కనిపించిన పిచ్‌పై రోజు మొత్తం కూడా నిలబడలేకపోయింది. ఐదు ఇన్నింగ్స్‌ల తర్వాత మొదటిసారి 200 పరుగులు దాటినా... భారత్‌కు సవాల్‌ విసిరేందుకు ఏమాత్రం సరిపోని స్కోరిది. అక్షర్‌ పటేల్, అశ్విన్‌ కలిసి ఏడు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టగా, సిరాజ్‌ రెండు కీలక వికెట్లు తీశాడు. రెండో రోజు నిలబడి టీమిండియా భారీ స్కోరు సాధిస్తే మ్యాచ్‌ చేతిలోకి వచ్చేసినట్లే.   

అహ్మదాబాద్‌: భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ వైఫల్యం వరుసగా మూడో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌ (55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.  లారెన్స్‌ (46 ; 8 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అక్షర్‌ పటేల్‌కు 4, అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ తొలి ఓవర్లోనే గిల్‌ (0) వికెట్‌ కోల్పోయింది. అయితే రోహిత్‌ (8 బ్యాటింగ్‌), పుజారా (15 బ్యాటింగ్‌) నిలబడటంతో ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 24 పరుగులకు చేరింది.  

రూట్‌ విఫలం...
గత రెండు టెస్టుల్లాగే ఈసారి కూడా ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఆరో ఓవర్‌ నుంచే స్పిన్నర్‌ను బౌలింగ్‌కు దించి భారత్‌ ప్రత్యర్థిని మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిం చింది. దానిని నిలబెట్టుకుంటూ ఈ ఓవర్‌ వేసిన అక్షర్‌ రెండో బంతికే సిబ్లీ (2)ని బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్లోనూ క్రాలీ (9)ని అవుట్‌ చేసిన అక్షర్‌ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్‌ జో రూట్‌ (5)ను చక్కటి ఇన్‌స్వింగర్‌తో సిరాజ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

అక్షర్, అశ్విన్‌

రూట్‌ కనీసం రివ్యూ కోరే ప్రయత్నం కూడా చేయలేదు. స్కోరు 30/3కి చేరిన ఈ దశలో స్టోక్స్, బెయిర్‌స్టో (28; 6 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా సిరాజ్‌ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన స్టోక్స్‌ ఎదురుదాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. స్టోక్స్‌ క్రీజ్‌లో ఉండటంతో వెంటనే అశ్విన్‌తో బౌలింగ్‌ చేయించిన ఎత్తుగడ ఈసారి పని చేయలేదు. అతని తొలి ఓవర్లోనే స్టోక్స్‌ సిక్సర్‌ బాది తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. అశ్విన్‌ ఓవర్లోనే అతని ఎల్బీ కోసం భారత్‌ చేసిన అప్పీల్‌ రివ్యూలో కూడా తిరస్కరణకు గురైంది.  

టపటపా...
లంచ్‌ విరామం తర్వాత కొద్ది సేపటికే సిరాజ్‌ కీలక వికెట్‌తో ఇంగ్లండ్‌ను మరింత ఇబ్బందుల్లో పడేశాడు. 146.4 కిలోమీటర్ల వేగంతో సిరాజ్‌ వేసిన బంతి నేరుగా బెయిర్‌స్టో ప్యాడ్లను తాకడంతో అంపైర్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. బెయిర్‌స్టో రివ్యూ కోరినా లాభం లేకపోయింది. మరో ఎండ్‌లో స్టోక్స్‌ పట్టుదలగా తన బ్యాటింగ్‌ కొనసాగించాడు. సుందర్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టిన అతను, అక్షర్‌ ఓవర్లో రివర్స్‌ స్వీప్‌తో 114 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే సుందర్‌ వేసిన ఒక చక్కటి బంతికి స్టోక్స్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. చివరి సెషన్‌ లో లారెన్స్, పోప్‌ (87 బంతుల్లో 29; 2 ఫోర్లు) కలిసి కొద్దిసేపు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే అశ్విన్‌ నాలుగు పరుగుల వ్యవధిలో పోప్, ఫోక్స్‌ (1)లను అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ పతనం వేగంగా సాగింది. అప్పటి వరకు ఓపిగ్గా ఆడిన లారెన్స్‌ కూడా అక్షర్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌ కాగా, మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సేపు పట్టలేదు.  

‘స్టోక్స్‌ నన్ను తిట్టాడు’
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ మధ్యలో స్టోక్స్, కోహ్లి మధ్య కాస్త వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. సిరాజ్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన సమయంలో సిరాజ్‌ను స్టోక్స్‌ ఏదో అన్నాడు. అయితే దీనికి జవాబివ్వకుండా సిరాజ్‌ నేరుగా విషయాన్ని తన కెప్టెన్‌కు చెప్పాడు. దాంతో సహచరుడికి అండగా కోహ్లి వెళ్లి స్టోక్స్‌తో గట్టిగా వాదించడం కనిపించింది. అంపైర్‌ వీరేందర్‌ శర్మ మధ్యలో జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఆట ముగిశాక మాట్లాడిన సిరాజ్‌... స్టోక్స్‌ తనను తిట్టడం వల్లే ఇదంతా జరిగిందని వెల్లడించాడు.   

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) సిరాజ్‌ (బి) అక్షర్‌ 9; సిబ్లీ (బి) అక్షర్‌ 2; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) సిరాజ్‌ 28; రూట్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 5; స్టోక్స్‌ (ఎల్బీ) (బి) సుందర్‌ 55; పోప్‌ (సి) గిల్‌ (బి) అశ్విన్‌ 29; లారెన్స్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 46; ఫోక్స్‌ (సి) రహానే (బి) అశ్విన్‌ 1; బెస్‌ (ఎల్బీ) (బి) అక్షర్‌ 3; లీచ్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 7; అండర్సన్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (75.5 ఓవర్లలో ఆలౌట్‌) 205. వికెట్ల పతనం: 1–10, 2–15, 3–30, 4–78, 5–121, 6–166, 7–170, 8–188, 9–189, 10–205.
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 9–2–23–0; సిరాజ్‌ 14–2–45–2; అక్షర్‌ పటేల్‌ 26–7–68–4; అశ్విన్‌ 19.5–4–47–3; సుందర్‌ 7–1–14–1.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: గిల్‌ (ఎల్బీ) (బి) అండర్సన్‌ 0; రోహిత్‌ (బ్యాటింగ్‌) 8; పుజారా (బ్యాటింగ్‌) 15; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (12 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 24.  
వికెట్ల పతనం:1–0.
బౌలింగ్‌: అండర్సన్‌ 5–5–0–1, స్టోక్స్‌ 2–1–4–0, లీచ్‌ 4–0–16–0, బెస్‌ 1–0–4–0. 

మరిన్ని వార్తలు