తొలిసారి ‘యూరో’ ఫైనల్లో ఇంగ్లండ్‌

9 Jul, 2021 05:18 IST|Sakshi
హ్యారీ కేన్‌ గోల్‌ సంబరం

సెమీస్‌లో డెన్మార్క్‌పై గెలుపు

11న ఇటలీతో టైటిల్‌ పోరు

లండన్‌: ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ అభిమానుల 55 ఏళ్ల  నిరీక్షణకు తెర పడింది. ఒక మెగా టోర్నీలో కొన్ని దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత ఆ జట్టు ఫైనల్‌ చేరింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ కప్‌లో ఇంగ్లండ్‌ తుది పోరుకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ 2–1 గోల్స్‌ తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించింది.  నిర్ణీత సమయానికి ఇరు జట్లు సమంగా నిలవగా... అదనపు సమయంలో సాధించిన గోల్‌తో ఇంగ్లండ్‌ ముందంజ వేసింది. డెన్మార్క్‌ తరఫున మైకేల్‌ డామ్స్‌గార్డ్‌ 30వ నిమిషంలో గోల్‌ చేసి ఆధిక్యం అందించగా... డెన్మార్క్‌కే చెందిన సైమన్‌ జార్‌ ‘సెల్ఫ్‌ గోల్‌’ (39వ నిమిషం)తో ఇంగ్లండ్‌ ఖాతాలో గోల్‌ చేరి స్కోరు సమమైంది. నిర్ణీత సమయం 1–1తో ముగిసింది. అనంతరం మ్యాచ్‌ ఎక్స్‌ట్రా టైమ్‌లో 104వ నిమిషంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్‌ గోల్‌ సాధించి తన జట్టును గెలిపించాడు. 1966లో ప్రపంచ కప్‌ గెలిచిన తర్వాత ఇంగ్లండ్‌ ప్రపంచ కప్‌లో గానీ, యూరో కప్‌లో గానీ (26 ప్రయత్నాల్లో) ఫైనల్‌ చేరలేకపోయింది.  

ఆద్యంతం హోరాహోరీ...
ఇంగ్లండ్, డెన్మార్క్‌ పోరు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. సుమారు 66 వేల మంది సొంత ప్రేక్షకుల సమక్షంలో వెంబ్లీ స్టేడియంలో ఇంగ్లండ్‌ దూకుడు ప్రదర్శించగా...టోర్నీలో సత్తా చాటుతూ వచ్చిన డెన్మార్క్‌ కూడా అదే జోరు కనబరిచింది. ముఖ్యంగా డెన్మార్క్‌ గోల్‌ కీపర్‌ కాస్పర్‌ స్కెమికల్‌ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని పదే పదే అడ్డుకున్నాడు. ఇరు జట్లు తొలి గోల్‌ కోసం శ్రమిస్తున్న దశలో ఇంగ్లండ్‌ ఫౌల్‌ కారణంగా డెన్మార్క్‌కు ఫ్రీ కిక్‌ అవకాశం దక్కింది. డామ్స్‌గార్డ్‌ దీనిని సమర్థంగా ఉపయోగించుకోవడంతో ఆ జట్టు ముందంజ వేసింది. ఆ తర్వాత హ్యారీ గోల్‌ చేసేందుకు చేరువగా వచ్చినా....డెన్మార్క్‌ కీపర్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే కొద్ది సేపటికే హ్యారీ సహచరుడు స్టెర్లింగ్‌కు బంతి అందకుండా తప్పించే ప్రయత్నంలో డెన్మార్క్‌ ఆటగాడు జార్‌ తన గోల్‌పోస్ట్‌లోకే బంతిని పంపించడంతో ఇంగ్లండ్‌ ఊపిరి పీల్చుకుంది.

వివాదాస్పద పెనాల్టీ...
స్కోర్లు సమమైన తర్వాత మరో 51 నిమిషాల పాటు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ ఆధిక్యం దక్కలేదు. ఎక్స్‌ట్రా టైమ్‌లో పెనాల్టీ ఏరియాలోకి దూసుకొచ్చిన ఇంగ్లండ్‌ ఆటగాడు స్టెర్లింగ్, డెన్మార్క్‌ ఆటగాడు మథియాస్‌ జెన్సన్‌కు తగిలి కింద పడ్డాడు. రిఫరీ పెనాల్టీ ప్రకటించగా... వీడియో రివ్యూ (వార్‌) తర్వాత అదే ఖాయమైంది.  హ్యారీ కొట్టిన కిక్‌ను ఈసారి కూడా స్కెమికల్‌ సమర్థంగా అడ్డుకున్నా... ‘రీబౌండ్‌’లో హ్యరీ మళ్లీ గోల్‌ పోస్ట్‌లోకి పంపించడంతో వెంబ్లీ మైదానం హోరెత్తిపోయింది. ఈ పెనాల్టీపై డెన్మార్క్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా లాభం లేకపోయింది.   
 

మరిన్ని వార్తలు