మరోసారి రెచ్చిపోయిన బెయిర్‌స్టో.. కివీస్‌ను ఊడ్చేసిన ఇంగ్లండ్‌

27 Jun, 2022 19:38 IST|Sakshi

లీడ్స్‌: న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఆతిధ్య ఇంగ్లండ్‌ 3–0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. హెడింగ్లే వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. న్యూజిలాండ్‌ నిర్ధేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 183/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. ఓలీ పోప్‌ (82) వికెట్‌ను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జో రూట్‌ (86 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడగా, బెయిర్‌స్టో (44 బంతుల్లో 71 నాటౌట్‌; 9 ఫోర్లు, సిక్సర్లు) మరోసారి చెలరేగి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. 

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ విధ్వంసకర శతకం (157 బంతుల్లో 162; 24 ఫోర్లు) బాదిన బెయిర్‌స్టో రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్‌కు అపురూప విజయాన్ని అందించాడు. అంతకుముందు రెండో టెస్ట్‌లోనూ బెయిర్‌స్టో ఇదే తరహాలో రెచ్చిపోయాడు. 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీ20 తరహాలో విధ్వంసం (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించి తన జట్టును గెలిపించాడు. 

మొత్తంగా ఈ సిరీస్‌లో 2 ధనాధన్‌ శతకాలు, ఓ హాఫ్‌ సెంచరీ బాదిన బెయిర్‌స్టో ఇంగ్లండ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ సైతం రెచ్చిపోయాడు. తొలి టెస్ట్‌లో అజేయమైన శతకంతో (115) జట్టును గెలిపించిన రూట్‌.. రెండో టెస్ట్‌లో (176) భారీ శతకం నమోదు చేశాడు. తాజాగా మూడో టెస్ట్‌లోనూ రూట్‌ చివరిదాకా క్రీజ్‌లో నిలబడి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.

ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మూడో టెస్ట్‌ స్కోర్‌ వివరాలు:
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 329 (డారిల్‌ మిచెల్‌ 109)
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 360 (బెయిర్‌స్టో 162)
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 326 (టామ్‌ బ్లండెల్‌ 88)
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 296/3 (54.2 ఓవర్లలో)
చదవండి: ENG vs NZ: వారెవ్వా రూట్‌! రివర్స్‌ స్కూప్‌ షాట్‌! వీడియో వైరల్‌!
 

మరిన్ని వార్తలు