ENG Vs PAK: పాకిస్తాన్‌ గడ్డపై ఇంగ్లండ్‌ సరికొత్త చరిత్ర.. 22 ఏళ్ల తర్వాత తొలి సారిగా

12 Dec, 2022 14:53 IST|Sakshi

పాకిస్తాన్‌ గడ్డపై ఇంగ్లండ్‌ జట్టు చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల తర్వాత తొలి సారి టెస్టు సిరీస్‌ను ఇంగ్లీష్‌ జట్టు కైవసం చేసుకుంది. ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో సిరీస్‌ను స్టోక్స్‌ సేన సొంతం చేసుకుంది. కాగా ఇంగ్లండ్‌ జట్టు చివరసారిగా పాక్‌ గడ్డపై  2000లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

పోరాడి ఓడిన పాక్‌
355 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ఆఖరి వరకు పోరాడింది. అయితే లంచ్‌ విరామం తర్వాత వరసక్రమంలో వికెట్లు కోల్పోవడంతో పాక్‌ 328 పరుగులకు ఆలౌటైంది. దీంతో నాలుగు రోజుల్లోనే ఇంగ్లండ్‌ మ్యాచ్‌ను ముగించింది. పాక్‌ బ్యాటర్లలో  షకీల్‌(94) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఇమామ్‌-ఉల్‌-హాక్‌(60), నవాజ్‌(45) పరుగులతో పర్వాలేదనపించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 4 వికెట్లతో అదరగొట్టాడు.

అతడితో పాటు రాబిన్సన్‌, జేమ్స్‌ అండర్సన్‌ తలా రెండు వికెట్లు, లీచ్‌, రూట్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 281 పరుగులు చేయగా.. పాకిస్తాన్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 202 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో 79 రన్స్‌ ఆధిక్యం ఇంగ్లండ్‌కు లభించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో 275 రన్స్‌కు ఆలౌటైంది. ఈ క్రమంలో  పాకిస్తాన్‌ ముందు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలిసి 355 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 108 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.


చదవండి: FIFA WC 2022: సెమీస్‌ వరకు ప్రయాణం ఇలా! 32 జట్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!

మరిన్ని వార్తలు