ఇంగ్లండ్‌ శుభారంభం

25 Jun, 2021 04:16 IST|Sakshi

కార్డిఫ్‌: శ్రీలంకతో ఆరంభమైన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి టి20లో ఇంగ్లండ్‌ 8 వికెట్లతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. దసున్‌ శనక (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ కుశాల్‌ పెరీరా (26 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్‌) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్యామ్‌ కరన్, ఆదిల్‌ రషీద్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలుపొందింది. జోస్‌ బట్లర్‌ (55 బంతుల్లో 68 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), జేసన్‌ రాయ్‌ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. డేవిడ్‌ మలాన్‌ (7) త్వరగా అవుటైనా... బెయిర్‌స్టో (13 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌)తో కలిసి బట్లర్‌ మ్యాచ్‌ను పూర్తి చేశాడు. బట్లర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’అవార్డు లభించింది. 

మరిన్ని వార్తలు