అదరగొట్టిన బ్రాడ్‌.. సిరీస్‌ ఇంగ్లండ్‌దే

28 Jul, 2020 20:34 IST|Sakshi

మాంచెస్టర్‌ : నాలుగు నెలల కరోనా విరామం తర్వాత జరిగిన క్రికెట్‌లో శుభారంభం అదిరింది. ఇంగ్లండ్‌- వెస్టిండీస్‌ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-1 తేడాతో విజ్డెన్‌ ట్రోపీని సొంతం చేసుకుంది. కాగా ఇరు దేశాల మధ్య జరిగే సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్టుకు విజ్డెన్‌ ట్రోపీని అందించడం ఆనవాయితీగా వస్తుంది. మూడో టెస్టులో భాగంగా 390 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన విండీస్‌ జట్టు 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో 269 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ జట్టు బారీ విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 5 వికెట్లతో రాణించగా, బ్రాడ్‌ మరోసారి 4 వికెట్లతో రాణించాడు.(అయ్యో బ్రాత్‌వైట్‌.. రెండుసార్లు నువ్వేనా)

అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లోనూ స్టువర్ట్‌ బ్రాడ్‌ 6 కీలక వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీయడం బ్రాడ్‌కు ఇది మూడోసారి. ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. కాగా విండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్‌ కాగా రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి 129 పరుగులకే కుప్పకూలింది.

కరోనా నేపథ్యంలో మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరిగిన ఈ సిరీస్‌ విజయవంతం కావడంతో క్రికెట్‌కు సరికొత్త ఊపునిచ్చింది. అసలే టెస్టు సిరీస్‌.. దీనిని ఎవరు పట్టించుకుంటారులే అన్న సందేహాలకు తావివ్వకుండా ఇరు జట్లు విజయం కోసం(మూడో టెస్టు మినహాయించి) పోరాడాయి.మొదటి టెస్టులో పర్యాటక జట్టు విండీస్‌ అద్భుతమైన విజయం సాధించి ఇంగ్లండ్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. అయితే రెండో టెస్టులో ఫుంజుకున్న ఆతిథ్య జట్టు విండీస్‌పై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మకంగా మారిన మూడో టెస్టుకు వరుణుడు అడ్డు తగిలినా ఇంగ్లండ్‌ బౌలర్ల అద్భుత బౌలింగ్‌తో ఆతిథ్య జట్టు ట్రోపీని ఎగరేసుకుపోయింది.('భవిష్యత్తులో ధావన్‌కు అవకాశం కష్టమే')

ఈ సిరీస్‌ క్రికెట్‌కు ఊతమివ్వడమేగాక పలు రికార్డులుకు వేదికయింది. జో రూట్‌ గైర్హాజరీలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ స్టార్‌ పేస్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు ఈ సిరీస్‌ మధురానుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిటెస్టులో తనను పక్కన పెట్టడం పట్ల బ్రాడ్‌ తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే బ్రాడ్‌ను పక్కన పెట్టి తప్పుచేశామా అని భావించిందేమో రెండో టెస్టులోకి అతన్ని జట్టులోకి తీసుకువచ్చింది. జట్టుకు దూరమయ్యానన్న కసితో బ్రాడ్‌ చెలరేగిపోయాడు. రెండో టెస్టులో 6 వికెట్లు, మూడో టెస్టులో ఫాస్టెస్ట్‌ ఆఫ్‌ సెంచరీతో పాటు 10 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక​కెరీర్‌లో 500 వికెట్లు సాధించిన రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా, ప్రపంచంలో 7వ బౌలర్‌గా నిలిచాడు.

మరిన్ని వార్తలు