Womes WC 2022: 'జప్ఫా' బంతితో మెరిసిన బౌలర్‌.. వీడియో వైరల్‌

24 Mar, 2022 16:15 IST|Sakshi

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌ సెమీస్‌ అవకాశాలు మెరుగుపరుచుకుంది. ఈ విషయం పక్కనబెడితే.. ఇంగ్లండ్‌ బౌలర్‌ కేథరిన్‌ బ్రంట్‌ మ్యాచ్‌లో సూపర్‌ బంతితో మెరిసింది. పాక్‌ బ్యాటర్లలో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన అమీన్‌ను ఔట్‌ చేసిన విధానం అద్బుతమనే చెప్పాలి.

ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌లో మూడో బంతిని బ్రంట్‌ మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో విసిరింది. క్రీజులో ఉన్న అమీన్‌ బంతిని డిఫెన్స్‌ చేయడంలో విఫలమైంది. అంతే బ్యాట్‌కు తాకిన బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. ఇలాంటి బంతులను క్రికెట్‌ బాషలో 'జప్ఫా' అని పిలుస్తారు. జప్ఫా అంటే బ్యాట్స్‌మన్‌ ఆడే వీలు కూడా లేకుండా బౌల్డ్‌ చేయడమే దీనర్థం. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

కాగా ఇంగ్లండ్‌ బౌలర్ల దెబ్బకు తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తా్న్‌ 41.3 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. పాక్‌ ఓపెనర్‌ అమీన్‌ 32 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచింది. ఇంగ్లీష్‌ బౌలర్లలో కేథరిన్‌ బ్రంట్‌, ఎకిల్‌స్టోన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. కేట్‌ క్రాస్‌, హెథర్‌నైట్‌లు ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం 106 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. డేనియల్‌ వ్యాట్‌ 76 నాటౌట్‌, హెథర్‌నైట్‌ 24 పరుగులు నాటౌట్‌ జట్టును గెలిపించారు.

చదవండి: MS Dhoni: ధోని ఎందుకీ నిర్ణయం.. కెప్టెన్‌గా ముగిస్తే బాగుండేది!

A post shared by ICC (@icc)
   

మరిన్ని వార్తలు