PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు.. 112 ఏళ్ల రికార్డు బద్దలు

1 Dec, 2022 18:58 IST|Sakshi

రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ  (డిసెంబర్‌ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ రికార్డుల మోత మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. తొలి రోజే 506 (4 వికెట్ల నష్టానికి) పరుగుల స్కోర్‌ చేసి, క్రికెట్‌ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

1910 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి రోజు 494 పరుగులు నమోదయ్యాయి. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో నేటి వరకు ఇదే తొలి రోజు అత్యధిక స్కోర్‌గా కొనసాగింది. తాజాగా ఇంగ్లండ్‌ తొలి రోజు అత్యధిక స్కోర్‌ చేసిన రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగానూ రికార్డు పుటల్లోకెక్కింది. 

ఈ రికార్డుతో పాటు తొలి సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ ఇంగ్లండ్‌ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌ తొలి సెషన్‌లో 27 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 174 పరుగులు చేసిన ఇంగ్లండ్‌.. టీమిండియా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. 2018లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలి సెషన్‌లో 158 పరుగులు స్కోర్‌ చేసింది. తాజాగా ఇంగ్లండ్‌.. ఈ రికార్డును కూడా బద్దలు కొట్టింది. 

ఇవే కాక, ఈ మ్యాచ్‌ తొలి రోజు ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే ప్రధమం. ఈ మ్యాచ్‌లో టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు 75 ఓవర్లలో 6.75 రన్‌రేట్‌ చొప్పున పరుగులు పిండుకున్నారు. 

ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (106 బంతుల్లో 101 నాటౌట్‌; 14 ఫోర్లు), జాక్‌ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్‌; 21 ఫోర్లు), ఓలీ పోప్‌ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 101 నాటౌట్‌) సెంచరీలతో విరుచుకుపడగా.. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కెప్టెన్‌ స్టోక్స్‌ (15 బంతుల్లో 34 నాటౌట్‌; 6 ఫోర్లు,  సిక్స్‌) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క రూట్‌ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) మినహాయించి అందరూ టీ20ల్లోలా రెచ్చిపోయారు.

మరిన్ని వార్తలు