ఒక్క పరుగుతో 66 ఏళ్ల ‘నో ఎక్స్‌ట్రా’ రికార్డు బ్రేక్‌

14 Feb, 2021 17:49 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా పూర్తి పైచేయి సాధించింది. ఆదివారం రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్‌ను 59.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్‌ చేసిన టీమిండియా పట్టు బిగించింది. ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లతో చెలరేగిపోయి ఇంగ్లండ్‌ వెన్నువిరిచాడు. అతనికి జతగా మిగతా స్సిన్నర్లు, పేసర్ల నుంచి సహకారం లభించడంతో ఇంగ్లండ్‌ కుప్పకూలింది. అశ్విన్‌కు జతగా అక్షర్‌ పటేల్‌, ఇషాంత్‌ శర్మలు తలో రెండు వికెట్లు తీయగా, సిరాజ్‌కు వికెట్‌ లభించింది. ఈ రోజు ఆటలో భారత్‌ నాలుగు, ఇంగ్లండ్‌ 10, ఆపై భారత్‌ మరో వికెట్‌ను కోల్పోవడంతో మొత్తంగా 15 వికెట్లు పడ్డాయి. 

66 ఏళ్ల రికార్డు బ్రేక్‌
భారత్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు సాధించడం ద్వారా ఒక అరుదైన రికార్డు లిఖించబడింది. ఈ మొత్తం పరుగులు భారత్‌ ఆటగాళ్లు సాధించనవే కావడం విశేషం. ఇందులో ఒక ఎక్స్‌ట్రా పరుగు కూడా లేదు. ఫలితంగా ఒక ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రా రన్‌ ఇవ్వకుండా అత్యధిక స్కోర్‌ 329 అందించిన జట్టుగా ఇంగ్లండ్‌ నిలిచింది. తొలి టెస్టులో భారీ ఎక్స్‌ట్రాలు ఇచ్చిన ఇంగ్లండ్‌.. ఆపై రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క ఎక్స్‌ట్రా కూడా ఇవ్వకపోవడం హైలైట్‌గా చెప్పొచ్చు.  దాంతో భారత్‌ పేరిట ఉన్న 66 ఏళ్ల రికార్డును ఇంగ్లండ్‌ అధిగమించింది.

1955లో లాహోర్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క ఎక్స్‌ట్రా ఇవ్వకుండా 328 పరుగులిచ్చింది. ఆ రికార్డును ఇంగ్లండ్‌ తాజాగా బ్రేక్‌ చేసింది. ఒక్క పరుగు ఇవ్వకుండా 329 పరుగులిచ్చి ఆరు దశాబ్దాల రికార్డును సవరించింది.  కేవలం ఒక్క పరుగు ఎక్కువగా ఇవ్వడంతోనే ఈ రికార్డు రావడం విశేషం. కాగా, 300/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో భారత్ రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. మరో 29 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌‌ను ముగించింది. ఓ వైపు యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్( 58 నాటౌట్; 77 బంతుల్లో  7 ఫోర్లు 3 సిక్స్‌లు) ధాటిగా ఆడినా.. మిగతా వారు విఫలమయ్యారు. దాంతో భారత్‌ రెండో రోజు ఆట త్వరగా ముగిసింది. పంత్‌ నాటౌట్‌గా నిలిచాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 249 పరుగుల ఆధిక్యంలో ఉంది. శుబ్‌మన్‌ గిల్‌(14) ఔట్‌ కాగా, రోహిత్‌ శర్మ( 25 బ్యాటింగ్‌), పుజారా(7 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.

ఇక్కడ చదవండి: 200 మంది లెఫ్ట్‌ హ్యాండర్స్‌.. తొలి బౌలర్‌గా రికార్డు

>
మరిన్ని వార్తలు