PAK VS ENG Test Series: పాకిస్తానీల మనసులు దోచుకున్న బెన్‌ స్టోక్స్‌

29 Nov, 2022 13:34 IST|Sakshi

3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌.. డిసెంబర్‌ 1 నుంచి రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనుంది. అనంతరం డిసెంబర్‌ 9 నుంచి రెండో టెస్ట్‌ (ముల్తాన్‌), 17 నుంచి మూడో టెస్ట్‌ మ్యాచ్‌ (కరాచీ) ఆడుతుంది. ఇంగ్లండ్‌-పాక్‌ల మధ్య మరో రెండు రోజుల్లో తొలి టెస్ట్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం క్రికెట్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. 

అదేంటంటే.. ఇటీవల పాకిస్తాన్‌లో వరదలు ఊహించని భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రకృతి సృష్టించిన ఈ మహా విళయంతో పాక్‌లోని చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో పాక్‌లో వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ముందుకు వచ్చాడు.

తనవంతు సాయంగా పాక్‌తో ఆడే టెస్ట్‌ సిరీస్‌ ద్వారా వచ్చే మ్యాచ్‌ ఫీజ్‌ మొత్తాన్ని వరద బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. క్రికెట్‌ నాకు చాలా ఇచ్చింది, అందులో కొంత కష్టకాలంలో ఉన్న ప్రజలకు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, నేను చేస్తున్న ఈ చిన్న సాయం వరద బాధితులకు ఏదో ఓ రకంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా అంటూ ఓ నోట్‌లో రాసుకొచ్చాడు.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ చూపిన ఔదార్యం గురించి తెలిసి క్రికెట్‌ అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పాకిస్తానీలయితే స్టోక్స్‌ను ఆకాశానికెత్తుతున్నారు. రాజువయ్యా, మహరాజువయ్యా అంటూ కొనియాడుతున్నారు. టీ20 వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో అద్భుతంగా ఆడి టైటిల్‌ తమకు దక్కకుండా చేసినా స్టోక్స్‌ను శభాష్‌ అంటున్నారు. నీ దయా గుణానికి హ్యాట్సాఫ్‌ అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు