జీతాల కోతకు ఇంగ్లండ్‌ క్రికెటర్లు ఓకే

24 Oct, 2020 06:07 IST|Sakshi

లండన్‌: కరోనా మహమ్మారి వల్ల టోర్నీలు, సిరీస్‌లు జరగక... పర్యటనలు లేక చాలా క్రికెట్‌ బోర్డులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. దీంతో పలు బోర్డులు జీతాల కోత విధిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రతిపాదనకు ఆ దేశ క్రికెటర్లు సమ్మతించారు. కోవిడ్‌ వల్ల ఇప్పటికే ఈసీబీ 100 మిలియన్‌ యూరోల (రూ. 874 కోట్లు) నష్టాన్ని చవిచూసింది. ఈ నష్టం వచ్చే ఏడాదికి రెట్టింపు (రూ. 1,748 కోట్లు) కానుందని ఈసీబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ అనివార్యమని భావించిన బోర్డు ఇప్పటికే 62 మంది ఉద్యోగులకు బైబై చెప్పింది.

అలాగే ఆటగాళ్ల కాంట్రాక్టు, మ్యాచ్‌ ఫీజుల కోతకు సిద్ధపడింది. ఈ మేరకు ఆటగాళ్ల సంఘం ముందు ప్రతిపాదన పెట్టగా తాజాగా ఆటగాళ్లు 15 శాతం కోతకు అంగీకరించారు. దీంతో ఈసీబీ డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌ తమ టీమ్‌ ఇంగ్లండ్‌ ప్లేయర్ల పార్ట్‌నర్‌షిప్‌ (టీఈపీపీ–ఇది ప్లేయర్ల అసోసియేషన్‌)కు అభినందనలు తెలిపారు. ‘ఆటగాళ్లతో బోర్డు బంధం ఎంతో ధృడమైనది. మా ఆటగాళ్ల సేవలకు గుర్తింపు ఇస్తాం. ఈ కష్టకాలంలో ఆటగాళ్లు కనబరిచిన పరిణతికి మా అభినందనలు, టెస్టు, వన్డే కెప్టెన్లు రూట్, మోర్గాన్, ఆటగాళ్లు అందరూ సవాళ్లను స్వీకరిస్తూనే బాధ్యతల్ని పంచుకుంటున్నారు’ అని గైల్స్‌ కొనియాడారు. టీఈపీపీ చైర్మన్‌ రిచర్డ్‌ బెవాన్‌ మాట్లాడుతూ క్లిష్ట సమయంలో ఆటగాళ్లంతా బోర్డుకు అండగా నిలవాలనుకోవడం గొప్ప విషయమని అన్నారు. 

మరిన్ని వార్తలు