PAK Vs ENG: టెస్టు సిరీస్‌.. 17 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌

27 Nov, 2022 08:58 IST|Sakshi

పాకిస్తాన్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ జట్టు ఆదివారం తెల్లవారుజామున పాక్‌ గడ్డపై అడుగుపెట్టింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్‌ పాక్‌లో టెస్టు సిరీస్‌ ఆడేందుకు రావడం ఆసక్తిగా మారింది. చివరగా 2005లో పాకిస్తాన్‌లో ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ ఆడింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ ట్విటర్‌లో ఇంగ్లండ్‌ టెస్టు బృందం పాకిస్తాన్‌లో ల్యాండ్‌ అయింది.. సిరీస్‌ ఆడడమే తరువాయి అని క్యాప్షన్‌ జత చేసి వీడియో రిలీజ్‌ చేసింది.

అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టు పాకిస్తాన్‌ గడ్డపై ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడేందుకు వచ్చింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 4-3 తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరల్డ్‌కప్‌ ఉండడంతో మళ్లీ ఇరుజట్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. టి20 వరల్డ్‌కప్‌ ముగిసిన అనంరతం ముందుగా అనుకున్న ప్రకారమే బెన్‌ స్టోక్స్‌ సేన పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది.

డిసెంబర్‌ 1 నుంచి రావల్పిండిలో తొలి టెస్టు జరగనుంది. ఆ తర్వాత ముల్తాన్‌ వేదికగా(డిసెంబర్‌ 9 నుంచి 13 వరకు) రెండో టెస్టు, కరాచీ వేదికగా డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు మూడో టెస్టు జరగనుంది. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరుజట్లకు ఈ సిరీస్‌ కీలకం కానుంది. ప్రస్తుతం పాకిస్తాన్‌ ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ ఏడో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్టు టాప్‌-4కు చేరుకునే అవకాశం ఉంది. ఇక టి20 ప్రపంచకప్‌లో గాయంతో దూరమైన మార్క్‌ వుడ్‌ పాక్‌తో టెస్టు సిరీస్‌ ఆడేది అనుమానంగా ఉంది.

వాస్తవానికి ఇంగ్లండ్‌ జట్టు గతేడాదే పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్‌ ఆడాల్సింది. కానీ కివీస్‌ సెక్యూరిటీ కారణాలతో సిరీస్‌ను రద్దు చేసుకోవడంతో ఇంగ్లండ్‌ పాక్‌ రావడానికి సంశయించింది. అయితే ఏడాది వ్యవధిలో పాకిస్తాన్‌లో కొంత పరిస్థితి మెరుగవడంతో ఇంగ్లండ్‌ ఆడడానికి ఒప్పుకుంది.

చదవండి: మారడోనా సరసన మెస్సీ.. కళ్లు చెదిరే గోల్‌ చూడాల్సిందే

'కొకైన్‌ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే'

మరిన్ని వార్తలు