వీరాభిమాని నం.1

17 Jan, 2021 06:05 IST|Sakshi
రాబ్‌ లూయిస్

పది నెలలుగా శ్రీలంకలోనే ఉన్న ఇంగ్లండ్‌ ఫ్యాన్‌ రాబ్‌ లూయిస్‌

ఎట్టకేలకు మ్యాచ్‌ చూసే అవకాశం

గాలే: ‘మరి కొద్ది రోజుల్లో కరోనా ముగిసిపోతుంది... వచ్చే నెల రోజుల్లో అంతా సర్దుకుంటుంది... ఇంగ్లండ్‌ జట్టు వచ్చి సిరీస్‌ ఆడుతుంది...’ ఇలా ఆశపడుతూనే అతను ఏకంగా పది నెలలు శ్రీలంకలోనే గడిపేశాడు. ఎట్టకేలకు ఆ వీరాభిమాని కోరిక తీరింది. ఆ అభిమాని పేరు రాబ్‌ లూయిస్‌. ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టంటే పడి చస్తాడు. ఇదే ఉత్సాహంతో అతను గత ఏడాది మార్చిలో శ్రీలంకలో జరిగే ఇంగ్లండ్‌ సిరీస్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకొని సిద్ధమైపోయాడు. ఆటగాళ్లు వెళ్లక ముందే అక్కడికి చేరుకొని ఎపుడెపుడా అని ఆట కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో కరోనా వచ్చేసింది... ప్రపంచమంతా మారిపోయింది.

ఇంగ్లండ్‌ పర్యటన కూడా వాయిదా పడింది. ఇటు శ్రీలంక నుంచి బయటకు వెళ్లేందుకు ఆంక్షలు, అటు ఇంగ్లండ్‌లో పరిస్థితి తీవ్రం. దాంతో 37 ఏళ్ల లూయిస్‌ లంకలోనే ఆగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుందని అతను ఊహించలేదు. త్వరలోనే సిరీస్‌ జరుగుతుందనే లూయిస్‌ కూడా ఆశిస్తూ వచ్చాడు.  వృత్తిరీత్యా వెబ్‌ డిజైనర్‌ అయిన అతను ఆన్‌లైన్‌లోనే కొంత మొత్తం సంపాదించడం, లంక కరెన్సీ విలువ చాలా తక్కువ కావడంతో అదృష్టవశాత్తూ అతనికి ఆర్థికపరంగా ఇబ్బంది ఎదురు కాలేదు.

చివరకు గురువారం ఇంగ్లండ్‌–శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభం కావడంతో అతని కోరిక నెరవేరింది. అయితే ఇదీ అంత సులువుగా దక్కలేదు. బయో బబుల్‌ కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో గాలే స్టేడియం చుట్టుపక్కల నుంచి ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడి నుంచే చూసేందుకు ప్రయత్నించాడు. చివరకు మైదానం పక్కనే ఉన్న ప్రఖ్యాత ‘డచ్‌ ఫోర్ట్‌’ ఎక్కి అతను వీక్షించాడు. అన్నింటికి మించి శనివారం డబుల్‌ సెంచరీ పూర్తి చేసిన అనంతరం రూట్‌ ప్రత్యేకంగా రాబ్‌ లూయిస్‌ వైపు తిరిగి తన బ్యాట్‌ చూపించడంతో అతని ఇన్నాళ్ల బాధ ఒక్కసారిగా దూరమైంది! తన గురించి తెలుసుకొని ఇంగ్లండ్‌ క్రికెటర్లు ఫోన్‌లో మాట్లాడారని చెప్పిన లూయిస్‌ ... సిరీస్‌ ముగిసిన తర్వాత వారితో కలిసి బీర్‌ తాగాలని కోరుకుంటున్నాడు!

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు