తెగ బాధపడిపోతున్నాడు.. ఎవరీ క్రికెటర్‌?

10 Jun, 2022 18:45 IST|Sakshi

ఒక ఫోటో మీ ముందు ఉంచి అందులో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పమంటే.. తెలిసిన వ్యక్తి అయితే టక్కున చెప్పేస్తారు. కానీ ఫోటోలో ఉన్న వ్యక్తి మొహం స్పష్టంగా కనిపించకపోయినా.. మొహానికి చేతులు అడ్డుపెట్టినా చెప్పడం కాస్త కష్టతరమే. తాజాగా అలాంటి ఫోటోనే ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని అంతా కోల్పోయినట్లుగా తెగ ఎమోషనల్‌ అవుతున్న ఒక క్రికెటర్‌ కనిపిస్తున్నాడు కదా.  ఆ క్రికెటర్‌ పేరేంటో చెప్పండి. 

అయితే ఫోటోలో ఉన్న క్రికెటర్‌ బాధపడుతున్నాడని భావిస్తే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఫోటోలో ఉ‍న్న వ్యక్తి విజయం సాధించామన్న ఆనందంలో.. అలా డ్రెస్సింగ్‌రూమ్‌లో ఒంటరిగా కూర్చొని తన సంతోషాన్ని కనిపించకుండా ఎంజాయ్‌ చేశాడు. ఇంతకీ ఆ క్రికెటర్‌ ఎవరో తెలుసా.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌. ఫోటో వెనుక కథ తెలియాలంటే 22 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. 

2000 సంవత్సరంలో ఇంగ్లండ్‌ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. నిర్ణయాత్మకమైన మూడో టెస్టు కరాచీ స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ జట్టు ఇంజమామ్‌ ఉల్‌ హక్‌(142), మహ్మద్‌ యూసఫ్‌(117) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ 388 పరుగులకు ఆలౌట్‌ అయింది. మైకెల్‌ ఆర్థర్‌టన్‌ 125 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌ 51 పరుగులు చేశాడు. దీంతో పాక్‌కు 17 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ అనూహ్యంగా 158 పరుగులకే కుప్పకూలడంతో ఇంగ్లండ్‌ ముందు 176 పరుగుల టార్గెట్‌ ఖరారు అయింది. తొలి రెండు టెస్టులు డ్రా కావడంతో మూడో టెస్టులో కచ్చితంగా ఫలితం రానుంది. అలా ఇంగ్లండ్‌  ఎన్న ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని విజయాన్ని సాధించింది. గ్రహమ్‌ థోర్ప్‌ 64 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్నంత సేపు పెద్ద హైడ్రామా నడిచింది. అప్పటి పాక్‌ కెప్టెన్‌ మొయిన్‌ ఖాన్‌ బ్యాడ్‌ లైట్‌ అంటూ అంపైర్లకు పదేపదే అప్పీల్‌ చేశాడు. అయితే అంపైర్లు మాత్రం మొయిన్‌ అభ్యర్థనను ఏ మాత్రం పట్టించుకోకుండా మ్యాచ్‌ను కంటిన్యూ చేశారు.

అలా ఇంగ్లండ్‌ మూడో టెస్టులో గెలడంతో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు కరాచీ అంతర్జాతీయ స్టేడియంలో పాక్‌కు దిగ్విజయమైన రికార్డు ఉంది. ఈ స్టేడియంలో అప్పటివరకు పాక్‌కు ఓటమనేదే లేదు. పాక్‌ 34 మ్యాచ్‌ల విజయాల జైత్రయాత్రకు ఇంగ్లండ్‌ ఒక రకంగా చెక్‌ పెట్టింది. కెప్టెన్‌గా సిరీస్‌ గెలవడంతో నాసర్‌ హుస్సేన్‌ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. అందుకే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చాకా ఒక్కడే కూర్చొని అంత ఎమోషనల్‌ అయ్యాడు. ఈ ఫోటో అప్పట్లోనే బాగా వైరల్‌ అయింది. ఇది అసలు విషయం. 

చదవండి: David Miller Birthday: 'కిల్లర్‌' మిల్లర్‌ అనగానే ఆ ఎపిక్‌ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం

రంజీలో సెంచరీ బాదిన క్రీడా మం‍త్రి.. సెమీఫైనల్‌కు బెంగాల్‌

మరిన్ని వార్తలు