యాషెస్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌

5 Jun, 2023 08:44 IST|Sakshi

జూన్‌ 16 నుంచి ప్రారంభం ​కాబోయే యాషెస్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాలి ఫ్రాక్చర్‌ కారణంగా ఆ  జట్టు స్టార్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ సిరీస్‌ మొత్తానికే దూరమయ్యాడు. తాజాగా ఐర్లాండ్‌తో ముగిసిన ఏకైక టెస్ట్‌ సందర్భంగా లీచ్‌ ఫ్రాక్చర్‌ కారణంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తదనంతరం జరిపిన స్కాన్‌లో లీచ్‌ పాదంలో పగుళ్లు గుర్తించినట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. లీచ్‌ ఐర్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో 4 వికెట్లు  పడగొట్టగా.. ఇంగ్లండ్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

కాగా, 31 ఏళ్ల జాక్‌ లీచ్‌ 2018లో ఇంగ్లండ్‌ తరఫున టెస్ట్‌ అరంగేట్రం చేసి 35 మ్యాచ్‌ల్లో 124 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. బ్యాటింగ్‌లో లీచ్‌ ఓ హాఫ్‌ సెంచరీ (92) సాధించాడు. 2019లో లీడ్స్‌లో జరిగిన టెస్ట్‌లో చివరి వికెట్‌కు బెన్‌ స్టోక్స్‌తో నెలకొల్పిన భాగస్వామ్యం లీచ్‌ కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆ మ్యాచ్‌లో లీచ్‌ చేసింది ఒక్క పరుగే అయినా వికెట్‌ పడకుంగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. మరో ఎండ్‌లో స్టోక్స్‌ (135 నాటౌట్‌) చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడి ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో లీచ్‌ సహకారంతో స్టోక్స్‌ చివరి వికెట్‌కు ఏకంగా 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇదిలా ఉంటే, 5 టెస్ట్‌ మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ జూన్‌ 16న మొదలై, జులై 31తో ముగుస్తుంది. బిర్మింగ్హమ్‌ వేదికగా తొలి టెస్ట్‌ (జూన్‌ 16-20), లార్డ్స్‌లో రెండో టెస్ట్‌ (జూన్‌ 28-జులై 2), లీడ్స్‌లో మూడో టెస్ట్‌ (జులై 6-10), మాంచెస్టర్‌లో నాలుగో టెస్ట్‌ (జులై 19-23), ఓవల్‌ వేదికగా ఐదో టెస్ట్‌ (జులై 27-31) జరుగుతుంది.

చదవండి: WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని గెలిచారు..?

మరిన్ని వార్తలు