ఇంగ్లండ్‌ ఒక్క టెస్ట్‌ కూడా గెలువలేదు: గంభీర్‌

1 Feb, 2021 20:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌తో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ జట్టు ఒక్క టెస్ట్‌ కూడా గెలిచే అవకాశం లేదని టీమిండియా మాజీ ఓపెనర్‌, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డారు. స్పిన్నర్‌లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై ఇంగ్లీష్‌ జట్టు పేలవమైన స్పిన్‌ అటాక్‌తో బరిలోకి దిగుతుందని, ఇది టీమిండియాకు కలిసొచ్చే విషయమని గౌతీ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌ స్పిన్‌ విభాగానికి సారధ్యం వహిస్తున్న మొయిన్‌ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. 60 టెస్ట్‌ల్లో 181 వికెట్లు సాధించిన మొయిన్‌ అలీ ఒక్కడే భారత్‌పై కాస్తో కూస్తో ప్రభావం చూపగలడని పేర్కొన్నాడు. ఇంగ్లీష్‌ స్పిన్నర్లు డామ్‌ బెస్‌, జాక్‌ లీచ్‌లను భారత బ్యాట్స్‌మెన్లు ఓ పట్టు పడతారని ఆయన భరోసాను వ్యక్తం చేశాడు. 

చెరి 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అనుభవమున్నఈ ఇంగ్లండ్‌ స్పిన్నర్లపై టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఎదురుదాడికి దిగితే.. నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3-0 లేదా 3-1 తేడాతో చేజిక్కించుకునే అవకాశం ఉందని గంభీర్‌ జోస్యం చెప్పాడు. అయితే పింక్‌ బాల్‌తో జరిగే టెస్ట్‌లో మాత్రం ఇరు జట్లకు సమానమైన అవకాశాలు ఉన్నయని ఆయన పేర్కొన్నాడు. శ్రీలంకపై 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌కు ఈ సిరీస్‌ చేదు అనుభవాల్ని మిగిలిస్తుందని గంభీర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత బౌలర్లు బూమ్రా, అశ్విన్‌లు ఈ సిరీస్‌లో కీలకం కానున్నారని గంభీర్ పేర్కొన్నాడు. కాగా, భారత్‌ ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగబోయే తొలి రెండు టెస్ట్‌లు చెన్నైలో, మూడు, నాలుగు టెస్ట్‌లు అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి.

మరిన్ని వార్తలు