ఆటకు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌

14 May, 2021 18:40 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ క్రికెటర్‌ హ్యారీ గార్నీ అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పాడు. గార్నీ ఇంగ్లండ్‌ తరపున 10 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లు కలిపి మొత్తం 14 వికెట్లు తీశాడు. 2014లో స్కాట్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన గార్నీ కెరీర్‌ మొత్తం గాయాలతో సతమతమయ్యాడు. ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతూనే ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

అయితే గార్నీ దేశవాలీ క్రికెట్‌లో మాత్రం దుమ్మురేపాడు. నాటింగ్‌హమ్‌షైర్‌ తరపున 103 ఫస్ట్‌క్లాస్‌, 93 లిస్ట్‌ ఏ, 156 టీ20 మ్యాచ్‌లాడి మొత్తంగా 614 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన గార్నీ 8 మ్యాచ్‌లాడి 7 వికెట్లు తీశాడు.2017లో టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో నాటింగ్‌హమ్‌షైర్‌ కప్‌ గెలవడంలో గార్నీ కీలకపాత్ర పోషించాడు.

ఇక తన రిటైర్మెంట్‌పై గార్నీ స్పందిస్తూ.. ''నా రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం. 24 ఏ‍ళ్ల నా ఫస్టక్లాస్‌ కెరీర్‌లో గాయాలు చాలా ఇబ్బందులు పెట్టాయి. చివరకు గుడ్‌బై చెప్పే సమయంలోనూ భుజం గాయంతో బాధపడుతున్నా.  అందుకే ఇక ఆడే ఓపిక లేకనే ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. కానీ ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నాటింగ్‌హమ్‌షేర్‌ను మాత్రం వదల్లేదు. వీటితో పాటు ఇంగ్లండ్‌కు ఆడడం.. ఐపీఎల్‌, బిగ్‌బాష్‌, సీపీఎల్‌ లాంటి మేజర్‌ టోర్నీలో పాల్గొనడం నాకు గర్వంగా అనిపించింది. ఇక క్రికెటకు వీడ్కోలు పలికిన నేను బిజినెస్‌మన్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నా. చివరగా నా భార్య అవ్రిల్‌కు కృతజ్థతలు.. కష్టకాలంలో తను నాకు తోడుగా నిలబడింది.. నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు నేనే అదృష్టవంతుడిని'' అని చెప్పుకొచ్చాడు.
 

మరిన్ని వార్తలు