ఆవేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్‌ బహిష్కరిస్తామని బెదిరింపులు..!

11 Sep, 2021 20:40 IST|Sakshi

IND VS ENG 5th Test Cancellation: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకావాల్సిన ఐదో టెస్ట్‌ రద్దైన నేపథ్యంలో ఇంగ్లీష్‌ ఆటగాళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారని తెలుస్తోంది. తమ జట్టు సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశముండటంతో టీమిండియా సభ్యులు కరోనా బూచి చూపించి కావాలనే బరిలోకి దిగేందుకు నిరాకరించారని వారు ఆరోపిస్తున్నారు. 

కొత్త కరోనా కేసులు నమోదవుతాయని భయపడిన టీమిండియా క్రికెటర్లు మాంచెస్టర్‌ వీధుల్లో తిరగడమేంటని నిలదీస్తున్నారు. ఇంతటితో ఆగని ఇంగ్లీష్‌ క్రికెటర్లు ఐపీఎల్‌ 2021 సెకెండ్‌ లెగ్‌ మ్యాచ్‌లను బహిష్కరిస్తామని హెచ్చరించారని తెలుస్తోంది. ఈ విషయమై(ఐపీఎల్‌ బహిష్కరణ) జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, క్రిస్‌ వోక్స్ ఇదివరకే నిర్ణయించుకున్నట్లు బ్రిటిష్‌ మీడియా కథనాలు సైతం ప్రచారం చేస్తోంది. ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఐదుగురు క్రికెటర్లలో ఒకరు ఇంగ్లండ్‌ ఆటగాళ్లను రెచ్చగొట్టారని సమాచారం.

ఇదిలా ఉంటే, భారత బృందంలో కరోనా కేసు వెలుగు చూడటంతో మ్యాచ్‌కు మూడు గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. భారత కోచింగ్‌ సిబ్బంది వరుసగా వైరస్ బారిన పడడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో సుదీర్ఘ చర్చల అనంతరం ఈసీబీ రద్దు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సొంతగడ్డపై సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని ఇంగ్లీష్ ప్లేయర్లు కడుపు మంటతో ఐపీఎల్‌ బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగారని సమాచారం.
చదవండి: ఆ మూడు ఐపీఎల్‌ జట్లకు భారీ షాక్‌.. ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లు దూరం
 

మరిన్ని వార్తలు