ఇంగ్లండ్‌ ఆట రెండింతలు...

7 Feb, 2021 04:37 IST|Sakshi
జో రూట్, ‌ బెన్‌ స్టోక్స్‌

రెండో రోజూ బ్యాటింగ్‌ జోరు

తొలి ఇన్నింగ్స్‌లో 555/8

జో రూట్‌ డబుల్‌ సెంచరీ

రాణించిన బెన్‌ స్టోక్స్‌  

చెన్నైలో ఇంగ్లిష్‌ మంత్రం రెండో రోజూ కూడా బాగా పని చేసింది. మొదటి రోజు ప్రదర్శనతోనే ఆగిపోకుండా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ దానిని కొనసాగిస్తూ శనివారం కూడా జోరు ప్రదర్శించారు. తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 600 పరుగులైనా చేస్తామని చెప్పిన జో రూట్‌ ముందుండి నడిపించడంతో జట్టు ఆ స్కోరుకు దాదాపు చేరువగా వచ్చింది. రూట్‌ అద్భుత డబుల్‌ సెంచరీతో అగ్రభాగాన నిలవగా, బెన్‌ స్టోక్స్‌ దూకుడైన బ్యాటింగ్‌ కారణంగా ఒకే రోజు 292 పరుగులు చేయడంలో ఇంగ్లండ్‌ జట్టు సఫలమైంది.

మద్రాస్‌ వేడిలో చెమటలు కక్కుతూ ఒక్కో వికెట్‌ కోసం తీవ్రంగా శ్రమించిన భారత బౌలర్లు ఒకింత అసంతృప్తితోనే రోజును ముగించాల్సి వచ్చింది. మూడో రోజు కూడా బ్యాటింగ్‌ కొనసాగించి వీలైనన్ని ఎక్కువ పరుగులు జోడించాలని ఇంగ్లండ్‌ భావిస్తుండగా... తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి భారీ స్కోరును అందుకోవడంలో భారత్‌ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతుందో చూడాలి. మొత్తంగా చూస్తే జీవంలేని పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా కనిపిస్తున్నా... మూడో రోజు నుంచి అనూహ్యంగా స్పందిస్తే మ్యాచ్‌ ఆసక్తికరంగా మారవచ్చు.

చెన్నై: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ సురక్షిత స్థితికి చేరుకుంది. మ్యాచ్‌ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 555 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బెన్‌ స్టోక్స్‌ (118 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాన్ని చేజార్చుకున్నాడు. ప్రస్తుతం డామ్‌ బెస్‌ (28 బ్యాటింగ్‌), జాక్‌ లీచ్‌ (6 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా రెండో రోజు ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేయడంలో విఫలమయ్యారు. 2016లో ఇదే మైదానంలో భారత్‌తో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేసి కూడా ఇన్నింగ్స్, 75 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్‌... దానిని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని భావిస్తూ బ్యాటింగ్‌ కొనసాగించినట్లు కనిపించింది.  

శతక భాగస్వామ్యం...
రెండో రోజు జత కలిసిన రూట్, స్టోక్స్‌ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌తో ఇంగ్లండ్‌ను ముందంజలో నిలిపారు. ముఖ్యంగా స్టోక్స్‌ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి వేగంగా పరుగులు సాధించాడు. అతను కొట్టిన మూడు సిక్సర్లు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. స్టోక్స్‌కు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. అశ్విన్, నదీమ్‌ వేసిన వరుస ఓవర్లలో స్టోక్స్‌ ఎల్బీడబ్ల్యూ కోసం కోహ్లి అప్పీల్‌ చేశాడు. అయితే రెండుసార్లూ డీఆర్‌ఎస్‌లో ఫలితం స్టోక్స్‌కు అనుకూలంగా వచ్చి భారత్‌ రివ్యూలు కోల్పోయింది. అనంతరం నదీమ్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో స్టోక్స్‌ 73 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, అంతకుముందే రూట్‌ 150 పరుగుల మార్క్‌ను దాటాడు. తొలి సెషన్‌లో భారత్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయింది. అయితే విరామం అనంతరం సెంచరీ దిశగా సాగుతున్న స్టోక్స్‌ను ఎట్టకేలకు నదీమ్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను లాంగ్‌ లెగ్‌లో పుజారా తడబడుతూనే అందుకున్నాడు. రూట్, స్టోక్స్‌ నాలుగో వికెట్‌కు 124 పరుగులు జోడించారు.  

ఇషాంత్‌ వరుస బంతుల్లో...
స్టోక్స్‌ వెనుదిరిగిన తర్వాత ఒలీ పోప్‌ (89 బంతుల్లో 34; 3 ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (51 బంతుల్లో 30; 5 ఫోర్లు) కెప్టెన్‌కు అండగా నిలిచారు. అశ్విన్‌ ఓవర్లో పోప్‌ ఎల్బీడబ్ల్యూ కోసం కూడా రివ్యూ కోరిన భారత్‌కు ఫలితం దక్కకపోగా, ఇన్నింగ్స్‌లో మిగిలిన మూడో రివ్యూ కూడా వృథా అయింది. మరోవైపు 341 బంతుల్లో రూట్‌ డబుల్‌ సెంచరీ పూర్తయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి లాంగాన్‌ మీదుగా కొట్టిన సిక్సర్‌తో రూట్‌ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. టీ తర్వాత పోప్‌ను అశ్విన్‌ అవుట్‌ చేయగా, రూట్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు నదీమ్‌ ముగింపు పలికాడు. వికెట్ల ముందు దొరికిపోయిన రూట్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. 18 పరుగుల వద్ద వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో బట్లర్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చినా అంపైర్‌ దానిని గుర్తించలేదు. భారత్‌కు రివ్యూలు లేకపోవడంతో నిరాశ తప్పలేదు. అయితే కొద్ది సేపటికే వరుస బంతుల్లో బట్లర్, ఆర్చర్‌ (0)లను అవుట్‌ చేసి ఇషాంత్‌ ఊరటనందించాడు. ఆర్చర్‌ వికెట్‌ ఇషాంత్‌కు భారత గడ్డపై 100వది కాగా, టెస్టుల్లో 299వది. అయితే ఆ తర్వాత మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడిన బెస్, లీచ్‌ అభేద్యంగా 30 పరుగులు జోడించిన ఆటను ముగించారు.  

క్యాచ్‌లు నేలపాలు...
రెండోరోజు కీలక సమయాల్లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఇచ్చిన క్యాచ్‌లు భారత ఫీల్డర్లు వదిలేశారు. 31 పరుగుల వద్ద స్టోక్స్‌ ఇచ్చిన కష్టసాధ్యమైన రిటర్న్‌ క్యాచ్‌ను అశ్విన్‌ ఒంటి చేత్తో అందుకునే ప్రయత్నం చేసినా అది చిక్కలేదు. నదీమ్‌ వేసిన తర్వాతి ఓవర్లోనే 32 పరుగుల వద్ద స్టోక్స్‌ బలంగా షాట్‌ బాదగా... వైడ్‌ మిడ్‌ వికెట్‌ వద్ద పుజారా ఎడంవైపు దూకుతూ క్యాచ్‌ పట్టేందుకు శ్రమించినా అది అతడి ఎడంచేతికి తగులుతూ వెళ్లిపోయింది. చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో బెస్‌ (స్కోరు 19) ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను మిడ్‌ వికెట్‌లో రోహిత్‌ శర్మ వదిలేశాడు. తొలి సెషన్‌లోనే అశ్విన్‌ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఆడి స్టోక్స్‌ సింగిల్‌కు ప్రయత్నించాడు. ఫీల్డర్‌ సుందర్‌ బంతిని తొందరగానే అందుకున్నా సరైన దిశలో విసరడంలో విఫలమయ్యాడు. నేరుగా స్టంప్స్‌కు తగిలితే కీపర్‌ ఎండ్‌ వైపు పరుగెత్తుతూ వచ్చిన రూట్‌ (స్కోరు 151) కచ్చితంగా రనౌటయ్యేవాడు. పంత్‌ కూడా స్టంప్స్‌కు దూరంగా ఉండటంతో సుందర్‌ త్రోను అందుకోలేకపోయాడు.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: రోరీ బర్న్స్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 33; సిబ్లీ (ఎల్బీ) (బి) బుమ్రా 87; లారెన్స్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 0; రూట్‌ (ఎల్బీ) (బి) నదీమ్‌ 218; స్టోక్స్‌ (సి) పుజారా (బి) నదీమ్‌ 82; పోప్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 34; బట్లర్‌ (బి) ఇషాంత్‌ 30; బెస్‌ (బ్యాటింగ్‌) 28; ఆర్చర్‌ (బి) ఇషాంత్‌ 0; లీచ్‌ (బ్యాటింగ్‌) 6; ఎక్స్‌ట్రాలు 37; మొత్తం (180 ఓవర్లలో 8 వికెట్లకు) 555.

వికెట్ల పతనం: 1–63, 2–63, 3–263, 4–387, 5–473, 6–477, 7–525, 8–525.

బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 27–7–52–2, బుమ్రా 31–4–81–2, అశ్విన్‌ 50–5–132–2, నదీమ్‌ 44–4–167–2, వాషింగ్టన్‌ సుందర్‌ 26–2–98–0, రోహిత్‌ శర్మ 2–0–7–0.

► భారత గడ్డపై ఒక విదేశీ బ్యాట్స్‌మన్‌ డబుల్‌ సెంచరీ చేయడం 2010 (బ్రెండన్‌ మెకల్లమ్‌– హైదరాబాద్‌లో) తర్వాత ఇదే తొలిసారి. మొత్తంగా భారత్‌పై టెస్టుల్లో 2014 (బ్రెండన్‌ మెకల్లమ్‌ – వెల్లింగ్టన్‌) తర్వాత ఒక బ్యాట్స్‌మన్‌ డబుల్‌ సెంచరీ చేయడం కూడా ఇదే మొదటిసారి.

► ఇంత భారీ స్కోరు చేసి మరో రెండు వికెట్లతో మూడో రోజుకు వెళుతున్నామంటే చాలా మంచి స్థితిలో ఉన్నట్లే. ఇదే స్కోరు వద్ద డిక్లేర్‌ చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు. భారత్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసినప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. ఆదివారం మరో గంట పాటు బ్యాటింగ్‌ చేయగలిగినా చాలు. పిచ్‌ మరీ అంత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఏమీ లేదు. మేం చాలా బాగా ఆడాం. దానిని గుర్తించాలి. వికెట్‌పై ఇంకా స్పిన్, బౌన్స్‌ ఉండటంతో పాటు బంతి రివర్స్‌ స్వింగ్‌ కూడా అవుతోంది. కాబట్టి మా బౌలింగ్‌లోనూ భారత్‌ను ఇబ్బంది పెట్టగలమని నమ్మతున్నా.    

► –బెన్‌ స్టోక్స్, ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌.వందో టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌ రూట్‌

► రూట్‌ కెరీర్‌లో ఇది ఐదో డబుల్‌ సెంచరీ. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లో కుక్‌ (5)తో సమంగా నిలవగా, అత్యధికంగా వాలీ హామండ్‌ 7 డబుల్‌ సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్‌ తరఫున కుక్‌ (12,472), గూచ్‌ (8,900) తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ జాబితాలో ఇప్పుడు రూట్‌ (8,467) మూడో స్థానానికి చేరాడు.

ఇషాంత్‌కు సహచరుల అభినందన

మరిన్ని వార్తలు