బట్లర్‌ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటో?

10 Aug, 2020 11:09 IST|Sakshi

మాంచెస్టర్‌: వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను గెలిచిన ఊపుమీద ఉన్న ఇంగ్లండ్‌ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్‌తో మాంచెస్టర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ మూడు వికెట్ల తేడాతో  విజయం సాధించింది. పాకిస్తాన్‌ నిర్దేశించిన 277 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంలో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌(75) కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన బట్లర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ సాధించి బ్యాట్‌తో కూడా మెరిశాడు. అయితే కీపింగ్‌లో మాత్ర బట్లర్‌ నిరాశపరిచాడు. ఇదే విషయాన్నే మ్యాచ్‌ తర్వాత ఒప్పుకున్న బట్లర్‌.. బ్యాట్‌తో రాణించకపోతే తనపై ఏవో కథనాలు రాసేవారన్నాడు. ‘ నేను కొన్ని చాన్స్‌లను మిస్‌ చేయకుండా ఉంటే ఇంకా రెండు గంటల ముందుగానే గెలిచే వాళ్లం. ఏది ఏమైనా గెలుపులో నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్వంగా ఉంది. నేను కీపింగ్‌ బాగా చేయలేదని తెలుసు. పలు అవకాశాలను నేలపాలు చేశాను. ఇలా అవకాశాల్ని వదిలేస్తే ఎన్ని పరుగులు చేసినా లాభం ఉండదు. 

ఒకవేళ నేను పరుగులు కూడా చేయకపోయి ఉంటే మీరు లేనిపోని వార్తలు రాసేవారేమో. ఇదే నా చివరి గేమ్‌ అని కూడా రాసేవారు. కానీ ఆ అవకాశం మీకు ఇవ్వలేదు. మీ నోటికి మీ చేతికి పని చెప్పలేదు. మనం ఎవరి గేమ్‌ వారు ఆడుకోవడమే తరువాయి’ అని బట్లర్‌ పేర్కొన్నాడు. అయితే బట్లర్‌ ఉన్నట్టుండి చివరి గేమ్‌ అనే ప్రస్తావన తీసుకురావడం కూడా వార్త అయ్యింది. అసలు బట్లర్‌కు భయంపట్టుకుందా అని మీడియాకు పని చెప్పే యత్నం చేసినట్లే ఉంది. మ్యాచ్‌ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడుతూ సీరియస్‌గా ఈ వ్యాఖ్యలు చేయడం ఏమిటి. బట్లర్‌కు పోటీ ఎక్కువగా ఉందనే విషయం అతని మాటలను బట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టులో జోస్‌ బట్లర్‌ కాకుండా రోరీ బర్న్స్‌, ఓలీ పోప్‌ వంటి యువ కీపర్లు ఉన్నారు. (వోక్స్, బట్లర్‌ అద్భుతం)

ఇప్పటికే బర్న్స్‌ టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. ఆడిన 19 మ్యాచ్‌ల్లోనే రెండు సెంచరీలు, 8 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఇక ఓలీ పోప్‌ 11 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1 సెంచరీ, 5 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. మరి బట్లర్‌ ఇప్పటివరకూ 45 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కేవలం ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. ఇక 17 హాఫ్‌ సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు.  పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బర్న్స్‌ ఉన్నప్పటికీ బ్యాట్‌మన్‌ పాత్రనే పోషించాడు. బ్యాటింగ్‌లో బర్న్స్‌ నిరాశపరచగా, బట్లర్‌ రాణించాడు. తాను ఒకదాంట్లో విఫలమైన మరొకదాంట్లో రాణిస్తానని బట్లర్‌ పరోక్షంగా ప్రస్తావించినట్లే కనబడుతోంది. ఓవరాల్‌గా చూస్తే బట్లర్‌ను ఇంగ్లండ్‌ జట్టు ఎక్కువగా పరిమిత ఓవర్ల ఆటగాడిగానే చూస్తోంది. కానీ బ్యాటింగ్‌లో నిలకడ ఉండటంతో టెస్టుల్లో కూడా బట్లర్‌ చోటు సంపాదించుకుంటూ వస్తున్నాడు. వచ్చే నెలతో 30 ఏళ్లు పూర్తిచేసుకోబోతున్న బట్లర్‌ తనకు ఇంకా టెస్టు క్రికెట్‌ ఆడాలనే విషయాన్ని సూత్రప్రాయంగా తెలిపినట్లు కనబడుతోంది. (‘వివో’ లేకుంటే నష్టమేం లేదు: గంగూలీ )

>
మరిన్ని వార్తలు