IPL 2022: సగం సీజన్‌ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి

28 Jan, 2022 16:23 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మధ్యలోనే వైదొలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి అంచె పోటీలకు అందుబాటులో ఉండనున్న ఇంగ్లండ్‌ ఆటగాళ్లు రెండో అంచె పోటీలకు మాత్రం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఐపీఎల్‌ 15వ సీజన్‌ను మార్చి 27 నుంచి మే చివరివారం వరకు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా అంతకముందు ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్‌ మెగావేలం నిర్వహించనున్నారు. ఈసారి మెగావేలంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు చాలా మందే తమ పేరును రిజిస్టర్‌ చేసుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ టెస్టు జట్టులో సభ్యులైన జానీ బెయిర్‌ స్టో, మార్క్‌వుడ్‌, డేవిడ్‌ మలన్‌, ఓలీ పోప్‌, క్రెయిగ్‌ ఓవర్టన్‌, సామ్‌ బిల్లింగ్స్‌, డాన్‌ లారెన్స్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా యాషెస్‌ సిరీస్‌లో పాల్గొన్నారు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ రిటైన్‌ చేసుకున్న జాస్‌ బట్లర్‌ కూడా టెస్టు జట్టులో సభ్యుడే. 

చదవండి:  మెగా వేలంలో నాకోసం లక్నో బడ్జెట్‌ ఎంత? బేస్‌ ప్రైస్‌

ఇక జూన్‌ 2 నుంచి లార్డ్స్‌ వేదికగా  ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే.. టెస్టు జట్టులోని ఆటగాళ్లు కనీసం 15 రోజుల ముందు నుంచే అందుబాటులో ఉండేలా ఈసీబీ ప్లాన్‌ చేసుకుంటుంది. అందుకోసం ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లను సీజన్‌ మధ్యలోనే వెనక్కి పిలిపించే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ కీలకం కావడంతో ఈసీబీ ఆటగాళ్లను రప్పించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో ఐపీఎల్‌ సీజన్‌లో కీలకమైన రెండో దశ పోటీలు జరగనున్న సమయంలోనే వాళ్లు వెనక్కి రావాల్సి ఉంటుంది.

అసలే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను 4-0తో దారుణ పరాభవం చూసిన ఇంగ్లండ్‌.. మళ్లీ టెస్టుల్లో పునర్వైభవం తెచ్చుకోవాలని భావిస్తోంది. అయితే ఈసీబీ తీరుపై ఐపీఎల్‌ అభిమానులు మాత్రం మండిపడ్డారు. వేలంలో కోట్టు కుమ్మరించి ఆటగాళ్లను తీసుకుంటారు. సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండాలని ఆయా ఫ్రాంచైజీలు కోరుకుంటాయి. ఇలా సగం సీజన్‌ ఆడి.. మిగతా మ్యాచ్‌లు ఆడకుండా వెళ్లిపోవడం బాగుండదు. సగం సీజన్‌ ఆడే బదులు అక్కడే ఉండిపోండి.. మీకు ఖర్చులు దండగా అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: Australian Open 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్‌.. కన్నీటిపర్యంతం

మరిన్ని వార్తలు