టీమిండియా ప్లేయర్‌కు కరోనా.. జాగ్రత్తగా ఉండాలని లేఖ!

15 Jul, 2021 09:04 IST|Sakshi

లండన్‌: విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 23 మంది ఆటగాళ్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. ఆటగాడి పేరు బయటకు వెల్లడించకపోగా.. ప్రస్తుతం అతను తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. 

ఇదిలా ఉంటే స్వల్ఫ గొంతు నొప్పిగా ఉండడంతో ఆ ఆటగాడికి పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ ఆటగాడితో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులను, సిబ్బందిని మూడురోజుల పాటు ఐసోలేషన్‌ వెళ్లమని వైద్య సిబ్బంది సూచించగా.. ఆ గడువు ముగిసింది. దీంతో గురువారం ఆ ఆటగాడు మినహా..  మిగతా వాళ్లంతా డర్హమ్‌కు బయలుదేరనున్నారు. ఇక బుధవారం బీసీసీఐ ప్రెసిడెంట్‌ గంగూలీ, చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ కోల్‌కతాలో సమావేశంకాగా, ఏం చర్చించారనే విషయంపై గోప్యతను ప్రదర్శించారు. 

మరోవైపు 20 రోజుల బ్రేక్‌ దొరికినప్పటికీ టీమిండియా ఆటగాళ్లను బయటకు వెళ్లొద్దని బీసీసీఐ సూచించినప్పటికీ.. కొందరు ఏకంగా వింబుల్డన్‌ టోర్నీకి హాజరయ్యారు కూడా. ఇక ఆటగాడు వైరస్‌ బారినపడ్డ(అసింప్టోమెటిక్‌ లక్షణాలు)  విషయం తెలిశాక.. బీసీసీఐ సెక్రెటరీ జై షా అప్రమత్తంగా ఉండాలని మిగతా ఆటగాళ్లను ఉద్దేశించి ఓ మెయిల్‌ లేఖను పంపారు. ప్రస్తుతం ఇం‍గ్లండ్‌లో డెల్టా వేరియెంట్‌ కేసులు పెరుగుతుండడంతోనే ఇలా సూచించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఆ ఆటగాడికి వైరస్‌ ఎలా సోకిందనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆగష్టు 5వ తేదీ నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈమధ్య పాకిస్థాన్‌లో సిరీస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ క్యాంప్‌లో కరోనా వైరస్‌ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు