England Vs India, 2nd ODI: భారత్‌ జోరును ఆపతరమా!

14 Jul, 2022 00:35 IST|Sakshi

నేడు ఇంగ్లండ్‌తో రెండో వన్డే 

గెలిస్తే టీమిండియా ఖాతాలో సిరీస్‌ 

తీవ్ర ఒత్తిడిలో బట్లర్‌ బృందం 

సా.గం.5.30నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

బర్మింగ్‌హామ్‌ టెస్టు ఫలితం తర్వాత ఇంగ్లండ్‌ జట్టు ఊహించి ఉండకపోవచ్చు తాము టి20 సిరీస్‌ కోల్పోతామని...ఊహించకపోవచ్చు తొలి వన్డేలో ఇంత ఘోరంగా ఓడతామని...బుమ్రా స్వింగ్‌ బౌలింగ్‌ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని అంచనా వేసి ఉండకపోవచ్చు...కానీ ఇప్పుడు వారికి టీమిండియా అసలు సత్తా ఏమిటో తెలిసొచ్చింది. మరో వైపు భారత బృందం ఆత్మవిశ్వాసం అంబరాన ఉంది. టి20ల్లాగే ఇక్కడా రెండో పోరులోనే సిరీస్‌ను గెలుచుకొని పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ఇదే లార్డ్స్‌ మైదానంలో వన్డే వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ ఆ స్ఫూర్తితో ప్రస్తుతానికి సిరీస్‌ కాపాడుకోగలదా చూడాలి.  
 
లండన్‌: ఏకపక్షంగా సాగిన మొదటి పోరు తర్వాత భారత్, ఇంగ్లండ్‌ తర్వాతి సమరానికి సన్నద్ధమయ్యాయి. గురువారం జరిగే రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. భారత్‌ తమ జోరు కొనసాగిస్తే 2–0తో సిరీస్‌ సొంతమవుతుంది. ఇంగ్లండ్‌ కోలుకోగలిగితే సిరీస్‌ ఫలితం ఆదివారానికి మారుతుంది. భారత్‌ అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్నా...సొంతగడ్డపై ఒకే మ్యాచ్‌ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను తక్కువగా అంచనా వేయడం సరైంది కాదు.  

మార్పుల్లేకుండా... 
గెలిచిన జట్టును మార్చేందుకు సహజంగా ఏ జట్టూ ఇష్టపడదు. భారత్‌ కూడా తాజా మ్యాచ్‌ విషయంలో అదే తరహాలో తుది జట్టును ఎంపిక చేయవచ్చు. గజ్జల్లో గాయంతో తొలి వన్డే ఆడని విరాట్‌ కోహ్లి కోలుకున్నాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అతను ఈ మ్యాచ్‌కూ దూరమయ్యే అవకాశాలే ఎక్కువ. దాంతో మార్పుల అవసరం కూడా ఉండకపోవచ్చు. బౌలింగ్‌లో బుమ్రా, షమీ మరోసారి ప్రధానాస్త్రాలుగా ప్రత్యర్థిపై చెలరేగడం ఖాయం. ప్రసిధ్‌ కూడా తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. కాబట్టి యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ అరంగేట్రానికి ఎదురు చూడాల్సి ఉంటుంది.

నాలుగో పేసర్‌గా పాండ్యా రూపంలో భారత్‌కు చక్కటి ప్రత్యామ్నాయం ఉంది. ఓవల్‌ మ్యాచ్‌లో చహల్‌ 2 ఓవర్లే వేయగా, జడేజా బౌలింగ్‌ చేయాల్సిన అవసరమే రాలేదు. ఈ సారి అవసరమైతే వీరంతా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లక్ష్యమే అయినా రోహిత్‌ మెరుపు బ్యాటింగ్‌ హైలైట్‌గా నిలిచింది. ధావన్‌ తన ఇన్నేళ్ల శైలికి భిన్నంగా బాగా నెమ్మదిగా ఆడటం కొంత ఆశ్చర్యపరిచే అంశమే అయినా...ఈ మ్యాచ్‌లో అతను దూకుడు పెంచాలి. శ్రేయస్, సూర్యకుమార్, పంత్‌లతో బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. హార్దిక్, జడేజా కూడా భారీ స్కోరులో కీలక పాత్ర పోషించగలరు. మొత్తంగా చూస్తే ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్రను సమర్థంగా పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు.  

బట్లర్‌కు పరీక్ష...
టాప్‌–6లో నలుగురు డకౌట్‌! వన్డేల్లో ఐదు వందలుకు చేరువగా టాప్‌–3 స్కోర్లు నమోదు చేసిన ఇంగ్లండ్‌ జట్టునుంచి ఇలాంటి ప్రదర్శన ఆశ్చర్యం కలిగించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరు నమోదు చేయడం, ఆపై ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం...ఇన్నేళ్లుగా ఆ జట్టు అదే తరహాలో విధ్వంసం కొనసాగిస్తోంది. అయితే పిచ్‌ కాస్త బౌలింగ్‌కు అనుకూలంగా మారగానే తొలుత బ్యాటింగ్‌ చేసి కూడా జట్టు కుప్పకూలింది. ఆ ప్రదర్శన ఒకే మ్యాచ్‌కే పరిమితమని ఇంగ్లండ్‌ నిరూపించాల్సి ఉంది. చాలా కాలంగా విఫలమవుతున్న రాయ్‌పై అదనపు ఒత్తిడి ఉండగా, మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో చెలరేగగలడా చూడాలి.

మిడిలార్డర్‌లో రూట్, స్టోక్స్‌ ఎంత బాధ్యతగా ఆడతారనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అన్నింటికి మించి బట్లర్‌ పాత్ర కీలకం. బ్యాటర్‌గా ఘనమైన రికార్డు ఉన్న అతను రెగ్యులర్‌ కెప్టెన్‌గా తొలి టి20 సిరీస్‌లో తడబడ్డాడు. సిరీస్‌ కోల్పోవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. మొదటి వన్డేలో కూడా ఓటమి పక్షాన నిలిచిన బట్లర్‌ ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ తన సామర్థ్యం నిరూపించుకోవాల్సి ఉంది. కనీస అనుభవం లేని పేస్‌ బౌలర్లు ఇంగ్లండ్‌ బలహీనతగా మారారు. విల్లీ, టాప్లీ, ఒవర్టన్, కార్స్‌లు బలమైన టీమిండియా లైనప్‌ను నిలువరించడం అంత సులువు కాదు. ఒవర్టన్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌కు అవకాశం దక్కవచ్చు.

పిచ్, వాతావరణం 
చక్కటి బ్యాటింగ్‌ పిచ్, భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం సమస్య లేదు. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవచ్చు.

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, హార్దిక్, జడేజా, షమీ, బుమ్రా, ప్రసిధ్, చహల్‌.  
ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), రాయ్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, లివింగ్‌స్టోన్, అలీ, విల్లీ, కార్స్, టాప్లీ, ఒవర్టన్‌/స్యామ్‌ కరన్‌. 

మరిన్ని వార్తలు