మరో ‘బయో’ పోరు...

5 Aug, 2020 02:51 IST|Sakshi

నేటి నుంచి ఇంగ్లండ్, పాక్‌ తొలి టెస్టు

మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

మాంచెస్టర్‌: సొంతగడ్డపై వరుసగా రెండో ‘బయో బబుల్‌’ సిరీస్‌ను నిర్వహించేందుకు ఇంగ్లండ్‌ సన్నద్ధమైంది. ఇటీవలే వెస్టిండీస్‌తో మూడు టెస్టు ల సిరీస్‌ జరగ్గా... ఇప్పుడు పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ తలపడనుంది. గత సిరీస్‌లాగే ఇది కూడా పూర్తిగా బయో సెక్యూర్‌ వాతావరణంలో, ప్రేక్షకులు లేకుండానే సాగనుంది. విండీస్‌తో సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2–1తో గెలవగా... పాక్‌ తమ చివరి టెస్టును ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌తో ఆడి ఇన్నింగ్స్‌ తేడాతో గెలుపొందింది.  

హోరాహోరీ...
స్వదేశంలో టెస్టుల్లో ఇంగ్లండ్‌ అత్యంత బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల విండీస్‌ తొలి మ్యాచ్‌లో నెగ్గడంద్వారా ఇంగ్లండ్‌ జట్టులోని లోపాలను కూడా బయటపెట్టింది. చివరకు సిరీస్‌ ఇంగ్లండ్‌ గెలిచినా... పాక్‌S వద్ద కూడా బలమైన బౌలింగ్‌ దళం ఉండటంతో సిరీస్‌ ఏకపక్షం కాకపోవచ్చు. గత సిరీస్‌ నెగ్గిన ఆటగాళ్లతోనే 14 మంది సభ్యుల జట్టును ఈ టెస్టు కోసం ఇంగ్లండ్‌ ప్రకటించింది. విండీస్‌పై సిరీస్‌ నెగ్గిన ఆత్మవిశ్వాసంతో రూట్‌ సేన బరిలోకి దిగుతోంది.  

పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ బలం ప్రధానంగా ఇద్దరు టాప్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ ఆజమ్, కెప్టెన్‌ అజహర్‌ అలీలపైనే ఆధారపడి ఉంది. వీరిద్దరు మాత్రమే నిలకడగా ఆడగల సమర్థులు. అసద్‌ షఫీఖ్, ఓపెనర్‌ షాన్‌ మసూద్, హారిస్‌ సొహైల్‌ కూడా తమ వంతు బాధ్యత పోషించాల్సి ఉంది. మరో ఓపెనర్‌ ఆబిద్‌ అలీ తొలిసారి ఇంగ్లండ్‌ గడ్డపై ఆడనున్నాడు. బౌలింగ్‌లో మాత్రం పాక్‌కు తగినన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. వీరిలో ముగ్గురు పేసర్లుగా షాహిన్‌ అఫ్రిది, అబ్బాస్, నసీమ్‌ షాలకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. నాలుగో పేసర్‌ను ఆడిస్తే టెస్టుల్లో పునరాగమనం చేసిన సీనియర్‌ వహాబ్‌ రియాజ్‌కు అవకాశం దక్కవచ్చు. స్పిన్నర్‌గా యాసిర్‌ షా కూడా కీలకం కానున్నాడు. బౌలింగ్‌ మెరుగ్గా కనిపిస్తున్నా...బ్యాటింగ్‌లోనూ భారీ స్కోరు సాధిస్తేనే పాక్‌కు అవకాశాలు ఉంటాయి.

ఇంగ్లండ్‌లో పాకిస్తాన్‌ 53 టెస్టులు ఆడగా... 12లో గెలిచి, 23లో ఓడింది. మరో 18 ‘డ్రా’గా ముగిశాయి.

మరిన్ని వార్తలు