Updated WTC Points Table: అగ్రస్థానాన్ని కోల్పోయిన సౌతాఫ్రికా

28 Aug, 2022 17:45 IST|Sakshi

ICC World Test Championship 2021-23 Updated Table: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో పరాజయంపాలైన సౌతాఫ్రికా, డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (66.67 శాతం విజయాలు) పడిపోయింది. సఫారీలపై విజయంతో ఇంగ్లండ్‌ ప్లేస్‌లో (35.19 శాతం విజయాలతో 7వ స్థానం) ఎలాంటి మార్పు లేనప్పటికీ.. చాలాకాలం రెండో ప్లేస్‌లో కొనసాగిన ఆసీస్‌కు మాత్రం ఈ విజయం కలిసొచ్చింది. 

ఆసీస్‌ 70 శాతం విజయాలతో తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా.. శ్రీలంక (53.33 శాతం విజయాలతో) 3వ స్థానంలో, టీమిండియా (52.08 శాతం విజయాలతో) 4వ స్థానంలో, పాకిస్థాన్ (51.85 శాతం విజయాలతో) ఐదులో, వెస్టిండీస్‌ (50 శాతం విజయాలతో) ఆరులో యధాతథంగా కొనసాగుతున్నాయి. ఆతర్వాత 25.93 శాతం విజయాలతో న్యూజిలాండ్‌ ఎనిమిదో స్థానంలో, 13.33 శాతం విజయాలతో బంగ్లాదేశ్‌ తొమ్మిదో ప్లేస్‌లో ఉన్నాయి. 

తాజా స్టాండింగ్స్‌ ప్రకారం చూస్తే ప్రస్తుత డబ్ల్యూటీసీ సీజన్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ సీజన్‌లో భారత్‌ మరో రెండో సిరీస్‌లు (స్వదేశంలో ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, బంగ్లాదేశ్‌‌లో 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్) మాత్రమే ఆడాల్సి ఉండటం, అందులో ఒకటి పటిష్టమైన ఆస్ట్రేలియాతో కావడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. భారత్‌ తదుపరి జరిగే 6 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఫైనల్స్‌ రేసులో నిలిచే అవకాశం ఉంది. దీంతో పాటు టీమిండియా పాయింట్ల కోతకు గురికాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ సమీకరణలన్నీ కుదిరితేనే భారత్‌ డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో ఫైనల్‌కు చేరే ఛాన్స్‌ ఉంటుంది. 

ఇదిలా ఉంటే, సఫారీలతో రెండో టెస్ట్‌లో బౌలింగ్‌లో జేమ్స్‌ ఆండర్సన్‌ (6/62), ఓలీ రాబిన్సన్‌ (5/91), స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/61), బెన్‌ స్టోక్స్‌ (4/47).. బ్యాటింగ్‌లో బెన్‌ స్టోక్స్‌ (103), బెన్‌ ఫోక్స్‌ (113 నాటౌట్‌) చెలరేగడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల టెస్ట్‌  సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. 
చదవండి: ఆండర్సన్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. పేసర్లలో మొనగాడిగా..!

మరిన్ని వార్తలు