-

వోక్స్, బట్లర్‌ అద్భుతం

9 Aug, 2020 02:30 IST|Sakshi

ఇంగ్లండ్‌ను గెలిపించిన జోడి 

తొలి టెస్టులో 3 వికెట్లతో పాక్‌ ఓటమి

మాంచెస్టర్‌: 277 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు 117 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది... ఓపెనర్లు సిబ్లీ (36), బర్న్స్‌ (10)లతో పాటు కెప్టెన్‌ రూట్‌ (42), స్టార్‌ ప్లేయర్‌ స్టోక్స్‌ (9), యువ బ్యాట్స్‌మన్‌ పోప్‌ (7) వెనుదిరిగారు. పాకిస్తాన్‌ బౌలర్లు అటు పేస్, ఇటు స్పిన్‌తో చెలరేగుతున్నారు. గెలుపు కోసం మరో 160 పరుగులు చేయాల్సి ఉంది. ఈ స్థితిలో ఇంగ్లండ్‌ ఓటమి ఖాయమనిపించింది. కానీ ఇద్దరు ఆటగాళ్లు పట్టుదలగా నిలబడ్డారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రిస్‌ వోక్స్‌ (120 బంతుల్లో 84 నాటౌట్‌; 10 ఫోర్లు), వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ (101 బంతుల్లో 75; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత ఆటతో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. పేలవ బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌ వైఫల్యంతో జట్టులో స్థానంపై సందేహాలు నెలకొన్న స్థితిలో బట్లర్‌... గత 17 ఇన్నింగ్స్‌లలో కనీసం అర్ధ సెంచరీ కూడా చేయకుండా విమర్శలు ఎదుర్కొంటున్న వోక్స్‌ తమ కోసం, తమ జట్టు కోసం ఆడారు.

పాక్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వన్డే శైలిలో పరుగులు రాబట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఆరో వికెట్‌కు వీరి 139 పరుగుల భాగస్వామ్యం జట్టును గెలుపు అంచు వరకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో బట్లర్‌ 55 బంతుల్లో, వోక్స్‌ 59 బంతుల్లోనే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు అన్ని విధాలా శ్రమించిన పాక్‌ బౌలర్లు చేతులెత్తేశారు. చివరకు 22 పరుగులు చేయాల్సిన స్థితిలో బట్లర్, ఆ వెంటనే బ్రాడ్‌ (7) అవుటైనా... వోక్స్‌ చివరి వరకు నిలిచి గెలిపించాడు. అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్‌ జట్టు విజయానికి చేరువగా వచ్చి కూడా దానిని అందుకోలేక మరోసారి తమ వైఫల్యాన్ని ప్రదర్శించింది. 3 వికెట్లతో మ్యాచ్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 137/8తో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకు ఆలౌటైంది.

మరిన్ని వార్తలు