PAK Vs ENG: ఇంగ్లండ్‌ క్రికెటర్ల పెద్ద మనసు..

16 Sep, 2022 08:36 IST|Sakshi

రాబోయే టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఇంగ్లండ్‌ జట్టు పాకిస్తాన్‌ గడ్డపై సుధీర్ఘ టి20 సిరీస్‌ ఆడనుంది. గురువారం రాత్రి పాకిస్తాన్‌కు చేరుకున్న ఇంగ్లండ్‌ జట్టు ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇది మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుంది. ఇంగ్లండ్‌ జట్టులో కెప్టెన్‌ బట్లర్‌ సహా ఇతర ఆటగాళ్లకు పాకిస్తాన్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడిన అనుభవం లేదు.

అలెక్స్‌ హేల్స్‌, మొయిన్‌ అలీ, లియామ్‌ డాసన్‌ లాంటి ఆటగాళ్లు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడడం ద్వారా పాక్‌ పిచ్‌లపై కాస్త అవగాహన ఉంది. అయితే గాయంతో బాధపడుతున్న కెప్టెన్‌ జాస్ట్‌ బట్లర్‌ సిరీస్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. పాకిస్తాన్‌లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పాక్‌లోని చాలా ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌ క్రికెటర్లు పెద్ద మనసు చాటుకున్నారు.

ఇదే విషయమై కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌ మాట్లాడుతూ..'' పాకిస్తాన్‌ ప్రస్తుతం భారీ వరదలతో అతలాకుతలమైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో మేము పాక్‌ గడ్డపై సిరీస్‌ ఆడేందుకు వచ్చాం. ఒక జట్టుగా గెలుపోటములు పక్కనబెడితే.. మ్యాచ్‌కు సంబంధించిన డొనేషన్స్‌ను వరద బాధితులకు అందేలా చూస్తాం. ఇందుకోసం ఈసీబీతో ఇప్పటికే మాట్లాడాము. ఈసీబీ కూడా మా వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని పెద్ద మొత్తంలో సాయం చేడయానికి ముందుకు రానుంది. క్రికెట్‌లో ఇలాంటి స్నేహపూరిత వాతావరణం ఉండడం చాలా మంచిది. ఇక ఇరుజట్ల మధ్య జరగనున్న టి20 సిరీస్‌.. వరద నష్టాల నుంచి పాక్‌ ప్రజలకు, అక్కడి అభిమానులకు మంచి ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇటీవలే ఆసియా కప్‌ ఫైనల్లో లంక చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్‌.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో గెలిచి టి20 ప్రపంచకప్‌కు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌ మాత్రం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ విజయం అనంతరం పాక్‌ గడ్డపై అడుగుపెట్టింది.

చదవండి: 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా'

మరిన్ని వార్తలు