Scotland Cricket Board: క్రికెట్‌లో అలజడి.. స్కాట్లాండ్‌ బోర్డు మూకుమ్మడి రాజీనామా

24 Jul, 2022 17:25 IST|Sakshi
స్కాట్లాండ్‌ క్రికెటర్లు మాజిద్ హక్, ఖాసిం షేక్

ఐసీసీ(ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌)లో అసోసియేట్‌ దేశంగా ఉన్న స్కాట్లాండ్‌ క్రికెట్‌లో ఆదివారం అలజడి రేగింది. స్కాట్లాండ్‌ క్రికెట్‌ బోర్డుకు ఒకేసారి ఆరుగురు మూకుమ్మడి రాజీనామా సమర్పించారు. క్రికెటర్లపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు రావడంతో బోర్డు సభ్యులు క్రికెట్‌ స్కాట్లాండ్‌ బోర్డుకు ఆదివారం రాజీనామా సమర్పించారు.

విషయంలోకి వెళితే.. ఇటీవలే స్కాట్లాండ్‌ లీడింగ్‌ ఆల్‌టైమ్‌ లీడింగ్‌ క్రికెటర్‌ మజిద్‌ హక్‌ స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్కాట్లాండ్‌ బోర్డు తమపై చూపిన వివక్ష గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్కాట్లాండ్‌ క్రికెట్‌ బోర్డు 'సంస్థాగతంగా జాత్యహంకారంగా' ముద్రపడిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. మజిద్‌తో పాటు తాను కూడా జాత్యహంకారానికి గురయ్యానని మరో క్రికెటర్‌ ఖాసిం షేక్ కూడా ఇంటర్య్వూలొ పేర్కొన్నాడు. మా శరీరం రంగు వేరు కావడంతో జట్టు మొత్తంలో మమ్మల్ని వేరుగా చూసేవారని తెలిపాడు. 

క్రికెటర్లు చేసిన సంచలన ఆరోపణలపై స్కాట్లాండ్‌ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. వారి నివేదికలో ఆటగాళ్లు చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. కాగా కమిటీ అందించిన నివేదిక పూర్తి సారాంశాన్ని సోమవారం బహిర్గతం చేయనుంది. అయితే ఈలోగాతాము చేసిన తప్పుకు చింతిస్తున్నామని.. బోర్డులో ఉన్న సభ్యులందరం రాజీనామా చేస్తున్నట్లు బోర్డుకు సంబంధించిన ఒక అధికారి తెలిపారు. ఈ మేరకు బోర్డు డైరెక్టర్లు ఆదివారం ఉదయం తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారికి రాజీనామా లేఖను పంపారు.

"బోర్డు ఆఫ్ క్రికెట్ స్కాట్లాండ్ రాజీనామా చేసింది. మేము తక్షణమే అమలులోకి వచ్చేలా చూస్తాం. ఇకపై @sportscotland భాగస్వామ్యంతో పని చేస్తాము. రాబోయే రోజుల్లో క్రీడకు తగిన పాలన, నాయకత్వం, మద్దతు ఉండేలా చూస్తాము. స్కాట్లాండ్‌ క్రికెట్‌ చిన్నదే కావొచ్చు.కానీ జాత్యంహంకార వ్యాఖ్యలకు పాల్పడితే మా దగ్గర కఠిన శిక్షలు ఉంటాయి. తమ తప్పు తెలుసుకొని బోర్డు సభ్యులు ముందే రాజీనామా చేశారు. ఇది అందరికి ఒక గుణపాఠం. ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం.'' అని  క్రికెట్ స్కాట్లాండ్ ఆదివారం ట్వీట్ చేసింది.

చదవండి: క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..?

మరిన్ని వార్తలు