Eoin Morgan: రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌

28 Jun, 2022 19:32 IST|Sakshi

ఇంగ్లండ్‌ పరిమిత​ ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. తాను సాధించిన దాని గురించి గర‍్వపడుతున్నానని, గొప్ప వ్యక్తులతో తన జ్ఞాపకాలు చిరకాలం గుర్తుపెట్టుకుంటానని తెలిపాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మంగళవారం ట్విటర్‌ వేదికగా ధృవీకరించింది. 

మోర్గాన్‌.. ఇంగ్లీష్‌ క్రికెట్‌ రూపురేఖలను మార్చిన గొప్ప క్రికెటర్‌ అని కొనియాడింది. మోర్గాన్‌ ఓ ఇన్నోవేటర్‌, ఓ మోటివేటర్‌, ఓ ఛాంపియన్‌ అంటూ ఆకాశానికెత్తింది. నీ వారసత్వం ఇలానే కొనసాగుతుంది.. థ్యాంక్యూ మోర్గాన్‌ అంటూ ట్విట్‌లో పేర్కొంది.  కాగా, మోర్గాన్‌ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని బ్రిటిష్ మీడియాలో గత కొన్ని రోజులుగా కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. 

ఐర్లాండ్‌ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించిన మోర్గాన్‌.. ఇంగ్లండ్‌ తరఫున తన 13 ఏళ్ల కెరీర్‌లో 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగుల రికార్డులు మోర్గాన్‌ పేరిటే నమోదై ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ అందించిన 35 ఏళ్ల మోర్గాన్‌.. గత సంవత్సరకాలంగా ఫిట్‌నెస్‌ సమస్యలు, ఫామ్‌ లేమితో సతమతమవుతున్నాడు. 

తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతను ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్‌.. కెరీర్‌ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్‌ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్‌ సెంచరీల సాయంతో  2458 పరుగులు చేశాడు.  
చదవండి: అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..!

మరిన్ని వార్తలు