ధోని రికార్డును బ్రేక్‌ చేసిన మోర్గాన్‌

5 Aug, 2020 14:37 IST|Sakshi

లండన్‌ : టీమిండియా క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని కెప్టెన్‌గా ఎంత విజయవంతమయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో ధోని కొట్టే హెలికాప్టర్‌ షాట్‌ ఎంత ఫేమసో.. అతని సిక్సర్లు కూడా అంతే ఫేమస్‌గా చెప్పుకోవచ్చు. కెప్టెన్‌గా ధోని 211 సిక్సర్లు కొట్టి కెప్టెన్ల జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ఆ రికార్డును ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ బ్రేక్‌ చేశాడు. కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన మోర్గాన్‌ ధోనిని అధిగమించి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

ఓవరాల్‌గా అత్యధిక సిక్సర్లు (212*) బాదిన కెప్టెన్‌గా ధోనీ(211)ని మోర్గాన్‌ అధిగమించాడు. మోర్గాన్‌ కేవలం 163 మ్యాచ్‌ల్లో  211 సిక్సర్లు బాదగా ధోనీ 332 మ్యాచ్‌ల్లో 211 మార్క్‌ అందుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇయాన్‌ మోర్గాన్‌ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్‌ సెంచరీతో చెలరేగి అరుదైన ఫీట్‌ సాధించాడు. ఆసీస్‌ క్రికెటర్ రికీ పాంటింగ్‌(171 సిక్సర్లు), బ్రెండన్‌ మెక్‌కలమ్‌(170 సిక్సర్లు) అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో ఉన్నారు. ఓవరాల్‌గా కెరీర్‌లో ఇయాన్ మోర్గాన్  328 అంతర్జాతీయ మ్యాచ్ సిక్సర్లు బాదాడు.  ఓవరాల్‌గా చూస్తే.. ధోనీ తన అన్ని ఫార్మాట్లు కలిపి కెరీర్‌లో 359 బంతులను సిక్సర్లుగా మలచగా.. మోర్గాన్ 328 బంతులను సిక్సర్లుగా బాదాడు. త్వరలోనే ఈ రికార్డును కూడా మోర్గాన్‌ తిరగరాసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక అంతర్జాతీయ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ‍్లలో క్రిస్‌ గేల్(534), షాహిద్‌ ఆఫ్రది( 476) సిక్సర్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ‌

మరిన్ని వార్తలు