Eoin Morgan Retirement: ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా మోర్గాన్‌ ప్రయాణం.. మధురానుభూతులు.. గుడ్‌ బై చెప్పడానికి కారణం ఇదేనంటూ!

29 Jun, 2022 07:11 IST|Sakshi
ఇయాన్‌ మోర్గాన్‌(PC: ECB)

లండన్‌: ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. వన్డే క్రికెట్‌లో ఆ జట్టు 44 ఏళ్ల కల నెరవేర్చిన నాయకుడు ఇయాన్‌ మోర్గాన్‌ ఆటకు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ వన్డేలు, టి20ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు 36 ఏళ్ల మోర్గాన్‌ ప్రకటించాడు. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లో ఫామ్‌ కోల్పోవడంతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఎన్నో మధురానుభూతులు
ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌ అయిన మోర్గాన్‌... గాయంతో చివరి మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. ‘రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయంగా భావించా. ఇది బాధాకరమే అయినా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. కెరీర్‌ ఆరంభం నుంచి 2019 ప్రపంచకప్‌ గెలవడం వరకు నా కెరీర్‌లో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి.

ప్రస్తుత స్థితిలో జట్టు కూర్పు నుంచి నేను తప్పుకుంటే కొత్తగా వచ్చే కెప్టెన్‌కు జట్టును రాబోయే వరల్డ్‌కప్‌లలో సమర్థంగా నడిపించేందుకు తగినంత సమయం లభిస్తుందని భావించా. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతా’ అని మోర్గాన్‌ వ్యాఖ్యానించాడు. ఒకదశలో తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు వెన్నెముకలా నిలిచిన మోర్గాన్‌ ఒక్కసారిగా ఫామ్‌ కోల్పోయాడు. 2021 జనవరి నుంచి 48 ఇన్నింగ్స్‌లో అతను ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు.

కెప్టెన్‌గా ప్రత్యేక అధ్యాయం... 
డబ్లిన్‌లో పుట్టిన మోర్గాన్‌ 16 ఏళ్ల వయసులో సొంత దేశం ఐర్లాండ్‌ తరఫున అరంగేట్రం చేసి 2007 వన్డే వరల్డ్‌కప్‌ ఆడాడు. మొత్తం 23 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఇంగ్లండ్‌ జట్టుకు మారాడు. మొదటి నుంచి దూకుడైన బ్యాటింగ్‌ శైలి కలిగిన మోర్గాన్‌ 2010 టి20 వరల్డ్‌కప్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టులో కూడా సభ్యుడు.

అప్పటి నుంచి అతను రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో రెగ్యులర్‌గా మారిపోయాడు. అయితే అతని కెరీర్‌లో అసలు మలుపు కెప్టెన్‌గా వచ్చింది. 2015 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అనూహ్యంగా అలిస్టర్‌ కుక్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో మోర్గాన్‌ను ఈసీబీ ఎంపిక చేసింది.

అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ప్రదర్శన పేలవంగా ఉన్నా... తర్వాతి నాలుగేళ్లలో అతను జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. అప్పటి వరకు వన్డేలను కూడా టెస్టుల తరహాలోనే ఆడుతూ వచ్చిన ఇంగ్లండ్‌... ఎన్నడూ లేని రీతిలో విధ్వంసకర జట్టుగా ఎదిగింది.

వన్డేల్లో అతని హయాంలోనే  ఇంగ్లండ్‌ ఐదుసార్లు 400కు పైగా పరుగులు సాధించగా, టాప్‌–3 ఆ జట్టు ఖాతాలోనే ఉన్నాయి. 2016 టి20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌ వరకు చేర్చిన మోర్గాన్‌ కెరీర్‌ లో 2019 వన్డే వరల్డ్‌కప్‌ విజయం అత్యుత్తమ క్షణం.

బ్యాటర్‌గా కూడా పలు ఘనతలు సాధించిన మోర్గాన్‌ పేరిటే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల (17) రికార్డు ఉంది. 16 టెస్టుల తర్వాత తన వల్ల కాదంటూ 2012లోనే అతను ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకున్నాడు. 

ఇయాన్‌ మోర్గాన్‌ కెరీర్‌ 
248 వన్డేల్లో 39.29 సగటుతో 7,701 పరుగులు (14 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు). 
115 అంతర్జాతీయ టి20ల్లో 136.17 స్ట్రయిక్‌రేట్‌తో 2458 పరుగులు (14 అర్ధ సెంచరీలు). 
చదవండి: IND vs IRE: ఉత్కంఠపోరులో టీమిండియా విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

మరిన్ని వార్తలు